కమర్షియల్‌కి పాతర పెట్టి డొమెస్టిక్ వినియోగం

30-10-2026 | 05:05am
  1. గృహావసర సిలిండర్లతో వాణిజ్య  వ్యాపారం 
  2. హోటల్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో విరివిగా వాడకం
  3. కన్నెత్తి కూడా చూడని సంబంధిత అధికారులు 

గుండాల, అక్టోబర్ 29 (విజయక్రాంతి): గృహ వినియోగానికి సబ్సిడీపై అందుతున్న వంట గ్యాస్ సిలిండర్లు(Gas cylinders) విరివిగా వాణిజ్య అవసరాలకు వాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నివాసాల్లో మాత్రమే వాడాల్సిన సిలిండర్లను హోటల్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, ఇతర వ్యాపార సముదాయాల్లో యథేచ్ఛగా వాడేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వాణిజ్య సిలిండర్ల(కమర్షియల్) ధరకు, గృహ వినియోగ సిలిండర్ల(డొమెస్టిక్) ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు గ్యాస్ ఏజెంట్ల ద్వారా పొందుతున్నా కూడా కనీసం పౌర సరఫరాల శాఖ పర్యవేక్షణ కరువైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో టిఫిన్ సెంటర్లు, హోటల్లు, బిర్యానీ పాయింట్స్, ఫాస్ట్ఫుడ్, తోపుడు బండ్లు, ఇతర తినుబండారాల దుకాణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అన్ని తినుబండారాల వ్యాపారులు నిత్యం గ్యాస్ ను అధికంగా వినియోగిస్తున్నారు.

నిబంధనల ప్రకారం వాణిజ్య అవసరాలకు తప్పనిసరిగా ’కమర్షియల్ సిలిండర్లు’ మాత్రమే ఉపయోగించాల్సి ఉండగా మండలంలోని అన్ని దుకాణాల్లో గృహ వినియోగ (డొమెస్టిక్ సిలిండర్లు) (14.2 కేజీలు) సిలిండర్లే దర్శనమిస్తుండడం గమనార్హం. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ తక్కువ ధరకు మరియు సులభంగా లభిస్తుండటంతో, అలాగే సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం, గ్యాస్ ఏజెన్సీలు సులభంగా సరఫరా చేస్తుండటంతో వ్యాపారులు వీటికే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు.

దీంతో గృహ వినియోగదారుల అవసరాలకు తక్షణమే అందడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గృహావసర గ్యాస్ సిలిండర్ల వినియోగంపై పౌర సరఫరాల శాఖ, లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. గ్యాస్ ఏజెన్సీల సరఫరా తీరుపై నిఘా ఉంచడంతో పాటు, వ్యాపార సముదాయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉండగా నిబంధనలకు విరుద్ధంగా గృహాల అవసర నిమిత్తం వాడే సిలిండర్లను వ్యాపారాల నిమిత్తం వాడితే సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కానీ క్షేత్రస్థాయిలో తనిఖీలు కూడా జరగకపోవడంతో వ్యాపారులు విరివిగా ఈ సిలిండర్లకే మొగ్గు చూపుతున్నారు.

ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఫలాలు, అత్యవసర సమయంలో గ్యాస్ అవసరమైన లబ్ధిదారులకు దక్కాలంటే అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టి, బ్లాక్ మార్కెట్ విక్రయాలకు, ఈ సిలిండర్ల వినియోగంపై దృష్టిసారించాలని డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే ఏజెన్సీలు, వ్యాపారులపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడక తప్పదు.

మరిన్ని వార్తలు