విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే...

07-10-2026 | 06:46pm

ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య..

ట్రస్మా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య..

యాదగిరిగుట్ట, అక్టోబర్ 7 (విజయక్రాంతి): సమాజంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత ఉన్నతమైన స్థానం ఉపాధ్యాయులదేనని, విద్యార్థులను భావి భారత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య(MLA Beerla Ilaiah) అన్నారు. బుధవారం యాదగిరిగుట్టలో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్(ట్రస్మా) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు గొట్టిపర్తి భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య దేవోభవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఉత్తమ ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఆచార్య దేవోభవ పురస్కారాలను ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను చదువుకునే రోజుల్లో ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణ, నైతిక విలువలే తనను నేడు ఎమ్మెల్యే స్థాయికి చేర్చాయని గుర్తుచేసుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఎలాంటి స్వార్థం ఉండదని, సొంత పిల్లలకంటే ఎక్కువగా పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఉపాధ్యాయులు నిరంతరం శ్రమిస్తారని కొనియాడారు. తల్లిదండ్రులు జన్మనిస్తే, విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్ది లోకానికి వెలుగునిచ్చేది గురువులేనని అన్నారు. ఒక విద్యార్థి సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా సంతోషపడేది గురువులేనని తెలిపారు.

టీచర్ల గౌరవార్థం 'Tr' హోదా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా....

వైద్యులకు పేరు ముందు 'డాక్టర్(Dr.)' అని ఎలాగైతే గుర్తింపు ఉంటుందో, అదే తరహాలో ఉపాధ్యాయులకు కూడా పేరు ముందు టీచర్(Tr)అనే హోదా కల్పించే విధానాన్ని కర్ణాటకలో అమలు చేశారని, ఇదే తరహా గౌరవాన్ని తెలంగాణలోని ఉపాధ్యాయులకు కూడా అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అమలు చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు.

యువత చెడు వ్యసనాలు, మాదకద్రవ్యాల బారిన పడకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలల సమస్యలు, ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాస్మా రాష్ట్ర సెక్రటరీ రమేష్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణీ భరత్ గౌడ్, కౌన్సిలర్లు ముక్కెర్ల మల్లేష్ యాదవ్, బూడిద మధు, మాజీ ఉప సర్పంచ్ గుండ్లపల్లి భరత్ గౌడ్, కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండీ సలాం, ట్రస్మా సంఘం ప్రతినిధులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు