పీహెచ్సీకి రెగ్యులర్ డాక్టర్ ని కేటాయించాలి

07-10-2026 | 05:11pm

- సిపిఐ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్ష

గుండాల, అక్టోబర్ 7 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి సమస్యలను పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ), అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యలో హాస్పిటల్ ముందు నిరవధిక నిరహార దీక్షను చేపట్టారు.

అనంతరం సిపిఐ మండల కార్యదర్శి వాగబోయిన రమేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్కే షాహిద్ లు మాట్లాడుతూ.. గత నాలుగు నెలల నుంచి రెగ్యులర్ డాక్టర్ ను కేటాయించకుండా రోజుకో డాక్టర్ ని డిప్యుటేషన్ పై పంపిస్తూ  వైద్య సేవలను నెట్టుకొస్తున్నారని, మండలంలో పేద, మధ్యతరగతి, గిరిజన కుటుంబాలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. అనారోగ్యం వచ్చినప్పుడు సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రే ప్రధాన ఆధారం. కానీ ఆసుపత్రిలో రెగ్యులర్ డాక్టర్ లేకపోవడం వల్ల ప్రజలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ప్రభుత్వ ఆసుపత్రి ఉంది… భవనం ఉంది… సిబ్బంది ఉన్నారు… కానీ ప్రజలకు అందుబాటులో ఉండే రెగ్యులర్ డాక్టర్ లేకపోతే ఆ ఆసుపత్రి వల్ల ప్రజలకు పూర్తి ప్రయోజనం ఎలా అందుతుందని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అత్యవసర పరిస్థితుల్లో, రాత్రి వేళల్లో, గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు, చిన్నపిల్లలకు వైద్యం అవసరమైనప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పేద కుటుంబాలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. ఆరోగ్యం అనేది దానం కాదు… ప్రజల హక్కు. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత కలిగి ఉంది.

అందుకే గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి వెంటనే రెగ్యులర్ డాక్టర్‌ను నియమించాలని ఈ నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నామన్నారు. గుండాల ఆసుపత్రికి రెగ్యులర్ డాక్టర్ను, మహిళా గైనకాలజిస్ట్ మరియు ఫార్మాసిస్ట్ ను నియమించాలని  డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రజాస్వామ్య పద్ధతుల్లో మా పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఊకె సమ్మయ్య, బచ్చల రామయ్య, గడ్డం శ్రీనివాస్, ఎస్కే సాహెబ్, లక్ష్మయ్య, కన్నయ్య, రవీందర్, చంద్రయ్య, వసంతరావు, సమీర్, పవన్ కల్యాణ్, రవివర్మ, నారాయణ, రమేష్, బిక్షం, సతీష్, మహేందర్, నాసిర్ యశ్వంత్, షబ్బీర్, హరీష్, సారయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు