పత్తి పంట కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలి
నిర్మల్ అక్టోబర్ 7 (విజయక్రాంతి): పత్తి పంట కొనుగోలు ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(District Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పత్తి పంట కొనుగోలు ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం సాగుచేసిన పత్తి పంట వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పత్తి పంట కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలన్నారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ నమోదు చేసుకొని రైతులు తమ పంటను అమ్ముకోవచ్చన్నారు.
రైతులెవరూ నష్టపోకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వివరించారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఇన్ ఛార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, ఆర్డీవో దేవీదాస్, సిసిఐ అధికారులు శరత్, వ్యవసాయ అధికారి సుజాత, జిల్లా మార్కెటింగ్ అధికారి గంగు, వివిధ వ్యవసాయ మార్కెటింగ్ ఛైర్మన్ లు భీమ్ రెడ్డి, షిండే ఆనంద్ రావు పటేల్, కళ్యాణ్, భైంసా ఎఎంసి వైస్ చైర్మన్ ఫారూఖ్ సిద్ధికి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు పుష్కరాల పనులకు సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించారు. పుష్కరాల పనులపై నిరంతర పర్యవేక్షణ కోసం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం పకడ్బందీగా పని చేయాలని తెలిపారు. జిల్లాలోని అన్ని పుష్కర ఘాట్ల వద్ద ఆయా నిర్మాణ పనులు నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఇప్పటినుంచే కట్టుదిట్టమైన చర్యల వల్ల గోదావరి పుష్కరాల నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇన్ ఛార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, సిపిఓ గంగారెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి రమణ, హౌసింగ్ పిడి శ్రీనివాస్, నీటిపారుదల, ఆర్ అండ్ బి ఈఈ లు అనిల్, సుభాష్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.