పంటల దిగుబడి మరియు స్థల పరిశీలన
ఉట్నూర్, నవంబర్ 11 ( విజయక్రాంతి): సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(Integrated Tribal Development Agency) (ITDA) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరంద్(ITDA Project Officer Manda Makarand) చొరవతో ఇంద్రవెల్లి మండలంలోని మల్లాపూర్ గ్రామంలో సీతాఫలం (కస్టర్డ్ ఆపిల్) పల్ప్ తయారీ పరిశ్రమ స్థాపనకు సంబంధించి బుధవారం రాష్ట్రస్థాయి బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది.
ఈ సందర్భంగా పరిశ్రమ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించడంతో పాటు, గ్రామంలో ఉన్న సీతాఫలం తోటలను సందర్శించి, సీతాఫలం ఉత్పత్తి, లభ్యత తదితర అంశాలను పరిశీలించారు. పరిశ్రమ స్థాపనకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను అంచనా వేసి, సమగ్ర ఫీజిబిలిటీ నివేదికను ప్రాజెక్టు అధికారి సమర్పించేందుకు అవసరమైన సర్వే నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు.
ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా గిరిజన రైతులకు తమ సీతాఫలం ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయం కల్పించడంతో పాటు, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి అవకాశం ఉంటుందని అధికారులు అన్నారు.
ఈ కార్యక్రమంలో SERP సీనియర్ మేనేజర్ మారుతి, యంగ్ ప్రొఫెషనల్ యశ్వంత్, JDM నాగభూషణం DLC శివశంకర్, గ్రామ సర్పంచ్, గ్రామ పటేల్, పంచాయతీ కార్యదర్శి, VO లీడర్ మరియు IKP CC తదితరులు పాల్గొన్నారు.