కూరగాయల కొనుగోలుకు వెళ్లి కాటికి చేరిన రైతు

11-11-2026 | 04:31pm

బొలెరో వాహనం ఢీకొని వృద్ధ రైతు దుర్మరణం

కంగ్టి, నవంబర్ 11( విజయక్రాంతి) : కూరగాయలు కొనుగోలు(Buying vegetables) చేసి, పంటకు పిచికారీ మందులు తీసుకొని ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్న ఓ రైతును వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన కంగ్టి మండలంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే. కంగ్టి మండలం దెగులవాడి గ్రామానికి చెందిన నాల్ చెరువు గోవింద్ రెడ్డి (72) తన పంటకు పిచికారీ చేయడానికి మందులు కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనంపై బుధవారం కంగ్టికి వెళ్లాడు.అక్కడ కూరగాయలు, పిచికారీ మందులు కొనుగోలు చేసుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు.

ఈ క్రమంలో గ్రామ సమీపానికి చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన MH 24 BW 1244 నంబర్ గల బొలెరో వాహనం ఆయన ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోవింద్ రెడ్డి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతుడి భార్య మాణికవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రవీందర్ గౌడ్ తెలిపారు.మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన కుమారుల రోదనలు గ్రామస్తులను కలచివేశాయి.ఈ ఘటనతో దెగులవాడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు