విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యం
కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి, నవంబర్ 11 (విజయక్రాంతి): విద్య ద్వారానే వ్యక్తిగత వికాసంతో పాటు సమాజ, దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతిని పురస్కరించుకుని బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్య, జాతీయ సమగ్రత, మతసామరస్యం, సమానత్వం కోసం ఆజాద్ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. విద్యార్థులు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని క్రమశిక్షణ, పట్టుదలతో విద్యనభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.ఈ
కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి డా. కుమారస్వామి, యువజన సర్వీసులు, క్రీడల శాఖ అధికారి రఘు, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు మొహమ్మద్ అబ్దుల్ హఫీజ్, మొహమ్మద్ మిరాజ్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఇర్ఫాన్, జామా మస్జిద్ అధ్యక్షుడు మొహమ్మద్ హబీబ్, మైనారిటీ నాయకులు రాజ్ మహమ్మద్, వలీ పాషా, అక్కని, నజీమ్, యాకుబ్, సాజిద్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.