మంత్రి పొంగులేటిపై రాజకీయ పబ్బం కోసమే బురదజల్లే ప్రయత్నం

05-11-2026 | 12:14am

తప్పు చేస్తే తనవారైనా మంత్రి ఉపేక్షించరు

రైస్ మిల్లుపై టాస్క్‌ఫోర్స్ దాడులు నిష్పక్షపాతం

అధికారులపై రాజకీయ ఒత్తిళ్ల ప్రచారంలో వాస్తవం లేదు

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న

చుంచుపల్లి (విజయక్రాంతి): రాజకీయంగా ఎదుర్కోలేకే ప్రతిపక్షాలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న(Congress President Thota Devi Prasanna) విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం చర్యలు తప్పవని ఆమె ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఆళ్ల మురళికి సంబంధించిన వ్యవహారం ఆయన వ్యక్తిగత వ్యాపార అంశమని, దీనితో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై టాస్క్‌ఫోర్స్ అధికారులు నిష్పక్షపాతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగానే సంబంధిత మిల్లుపై దాడులు జరిగాయని తెలిపారు. తప్పు చేసిన వారు తనకు ఎంతటి ఆప్తులైనా మంత్రి పొంగులేటి ఉపేక్షించరని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.

అధికారులపై మంత్రి రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని ఖండించారు. మంత్రి పుట్టినరోజు నాడే సంబంధిత మిల్లుపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి కేసు నమోదు చేయడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందని, కోర్టు ఆదేశాలు, నిర్ణయాలకు అనుగుణంగానే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వానికి ఎవరిపైనా కక్షసాధింపు చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదని, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాజకీయంగా విమర్శలు చేయడం పేరుతో అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని తోట దేవి ప్రసన్న ప్రతిపక్షాలకు హితవు పలికారు.

మరిన్ని వార్తలు