రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి
బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు దొడ్డా రమేష్
దమ్మపేట, నవంబర్ 04 (విజయక్రాంతి): మండలంలో మురసు తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మండలంలోని రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి పంట నష్టాన్ని ప్రకటించాలని బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు దొడ్డా రమేష్(BRS ex-Mandal President Dodda Ramesh) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో కురిసిన భారీ వర్షాల వలన వరి, మొక్కజొన్న, అరటి, వేరుశెనగ తదితర పంటలు దెబ్బతిన్నయని అన్నారు. మండలంలో జరిగిన పంటనష్టాన్ని అధికారులు వెంటనే సర్వే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అలాగే అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతినటమే కాకుండా గ్రామాలలో వర్షాలకు దెబ్బతిన్న పూరిండ్లకు ప్రభుత్వం వెంటనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, గ్రామాలలో అంటువ్యాధులు ప్రభలకుండా తక్షణమే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, నీట మునిగిన కాలనీలు, వీధుల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. రోడ్ల మీద పొంగి పొర్లుతున్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ రోడ్ మార్గాలను ఏర్పాటు చేసి, తెగిన చెరువులను, కుంటలను, రోడ్లను వర్షం, వరద తగ్గిన వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేసారు.