వాల్టా చట్టానికి అటవీశాఖ అధికారుల తూట్లు
మామిడి చెట్ల నరికివేత అక్రమ రవాణా కేసులో ఇద్దరు అటవీశాఖ అధికారుల సస్పెండ్
మహబూబాబాద్, (విజయక్రాంతి): అటవీ పరిరక్షణకు పాటుపడాల్సిన అధికారులు వాల్టా చట్టాన్ని సక్రమంగా అమలు చేయడంలో విఫలమయ్యారు. గూడూరు ఏజెన్సీ ప్రాంతంలో అక్రమంగా మామిడి చెట్ల(Mango Tree)ను నరికి రవాణా చేసిన ఘటనలో ఉన్నతాధికారుల విచారణలో వాస్తవమని తేలడంతో నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటుపడింది.
మహబూబాబాద్ జిల్లా గూడూరు అటవీ శాఖ పరిధిలో అక్రమంగా గత ఆగస్టు నెలలో మామిడి చెట్ల నరికివేత అక్రమ రవాణా వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలపై విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు ఇద్దరు అటవీశాఖ అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం అటవీ సంరక్షణాధికారి (సిసిఎఫ్) డాక్టర్ భీమా నాయక్ ఉత్తర్వులు జారీ చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి.
గూడూరు అటవీ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పిచ్చేశ్వరరావు, మచ్చర్ల సెక్షన్ అధికారి శ్రీను పై సస్పెన్షన్ విధించారు. ఇదే ఘటనలో ఇంతకుముందు పది రోజుల క్రితం ఇద్దరు బీట్ ఆఫీసర్లు శ్రీధర్, పుల్ సింగ్ సస్పెండ్ కాగా, తాజాగా ఇద్దరు అధికారులపై వేటుపడడంతో గూడూరు అటవీ శాఖలో తీవ్ర సంచలనం రేపింది.