అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు

21-11-2026 | 09:51pm

ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి వెల్లడి

ఆదిలాబాద్,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించి ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు పెద్ది సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan Reddy) అన్నారు. గతంలో వివిధ కారణాలతో పింఛన్లు పొందలేక ఇబ్బందులు పడుతున్న అర్హులను గుర్తించి కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం ఆదిలాబాద్ లో గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన చేయూత పింఛన్ల(Cheyutha Pension) మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ముందుగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను ఆలపించారు. ఈ సందర్భంగా అర్హులైన వారికి మంజూరైన ఆసరా చేయూత పెన్షన్ పత్రాలను అతిథులు అందజేశారు. అదేవిధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో తొలిరోజే నమోదు ప్రకీయాలో 5,536 కుటుంబాల నమోదు చేసుకున్నారు. 

  ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో పింఛన్లు అందక ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే నిర్వహించినట్లు తెలిపారు. పింఛన్ల కోసం దరఖాస్తులను పరిష్కరించి అర్హులకు పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

ఎన్నో ఏళ్లుగా పింఛన్ కోసం ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ బండారి అనూష, మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ మల్లెపూల నరసయ్య, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బిన్ అందన్, పలువురు ప్రజా ప్రతినిధులు, ఆయా పార్టీల నేతలు, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు