భద్రాచలంలో ప్రశాంతంగా ముగిసిన బంద్‌

21-11-2026 | 10:22pm

భద్రాచలం ( విజయక్రాంతి): పట్టణంలో ఈ నెల 17వ తేదీ అర్ధరాత్రి జరిగిన యువకుల ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన తెల్లం శరత్ కుమార్(Tellam Sharath Kumar) కుటుంబానికి న్యాయం చేయాలని, పట్టణంలో రౌడీయిజం, అసాంఘిక కార్యకలాపాలను(Rowdyism and anti-social activities) అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక(United platform of tribal communities), ప్రజా సంఘాలు, పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన భద్రాచలం బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచి పట్టణంలో నిరసనలు చేపట్టిన నాయకులు, కార్యకర్తలు బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. బంద్‌కు భద్రాచలం పట్టణంలోని వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా సహకరించాయి. దుకాణాలు, వ్యాపార సంస్థలను మూసివేసి నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపాయి. పలు రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు సైతం బంద్‌కు మద్దతు ప్రకటించడంతో పట్టణంలో నిరసన వాతావరణం నెలకొంది.

బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని నాయకులు పేర్కొంటూ స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ఘటనపై స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.బంద్‌ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పట్టణంలోని ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో అప్రమత్తంగా వ్యవహరించారు. ముందస్తు భద్రతా చర్యలు చేపట్టి పరిస్థితిని పర్యవేక్షించడంతో బంద్‌ ప్రశాంతంగా కొనసాగింది.

ఎలాంటి ఘర్షణలు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిరసన కార్యక్రమం ముగిసింది.బంద్‌కు స్వచ్ఛందంగా సహకరించిన వ్యాపార వర్గాలకు, మద్దతు తెలిపిన రాజకీయ పార్టీల నాయకులకు, కుల సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులకు భద్రాచలం ఆదివాసీ జేఏసీ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు