భార్య హత్య కేసులో భర్తకు సహకరించిన నిందితులు ముగ్గురు అరెస్ట్

21-11-2026 | 10:16pm

మృతదేహాన్ని పూడ్చిపెట్టి, అనంతరం గోదావరి నదిలో పడవేసిన నిందితులు

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన Cr.No.205/2026 U/s 103, 238 r/w 3(5) BNS కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. భార్యను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడైన బోడా నరేందర్‌కు సహకరించిన అతని తండ్రి బోడా హరిలాల్, సోదరుడు బోడా సురేందర్, స్నేహితుడు మాలోత్ శోభన్‌లను పోలీసులు అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. బోడా నరేందర్ 2025 సంవత్సరంలో గంగారపు భవానీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంతో నరేందర్ తండ్రి హరిలాల్, సోదరుడు సురేందర్ ఈ వివాహాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగా భవానీని వదిలించుకోవాలని నరేందర్‌పై కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఈ క్రమంలో నరేందర్ తన తండ్రి హరిలాల్, సోదరుడు సురేందర్‌తో కలిసి భార్య భవానీని హత్య చేసేందుకు పథకం రూపొందించుకున్నాడు. ఇందులో భాగంగా ఈనెల 3 వ తేదీ రాత్రి నరేందర్ తన భార్య భవానీని గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తండ్రి హరిలాల్ సహాయంతో గోలియతండా గ్రామ శివారులోని తమ పత్తి చేనులో గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.

మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో విషయం బయటపడుతుందనే భయంతో 4 వ తేదీన మరో పథకం రచించారు. రాత్రి సమయంలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి, శుభ్రం చేసి దుస్తులు మార్చి, రెండు తెల్లని ప్లాస్టిక్ సంచుల్లో చుట్టి మోటార్ సైకిళ్లపై భద్రాచలం వైపు తరలించారు. ఈ సమయంలో నరేందర్ తన తండ్రి హరిలాల్‌తో కలిసి ఒక మోటార్ సైకిల్‌పై మృతదేహాన్ని తీసుకెళ్లగా, సోదరుడు సురేందర్, స్నేహితుడు మాలోత్ శోభన్ మరో మోటార్ సైకిల్‌పై ముందుగా వెళ్లి పోలీసుల గస్తీ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఎస్కార్ట్‌గా వ్యవహరించారు. అనంతరం భద్రాచలం పాత వంతెన సమీపంలోని గోదావరి నదిలో మృతదేహాన్ని పడవేసి తిరిగి గ్రామానికి చేరుకున్నారు.

ఈ క్రమంలో  6న భవానీ కనిపించడం లేదని ఆమె అక్క స్వరూప కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం ప్రధాన నిందితుడు నరేందర్ విచారించగా భార్యను హత్య చేసిన విషయాన్ని వెల్లడించాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

తదుపరి దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించి, నిందితుల పాత్రను పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న బోడా హరిలాల్, బోడా సురేందర్, మాలోత్ శోభన్‌లను శనివారం  ఉదయం 11:40 గంటలకు లక్ష్మీదేవిపల్లి మండలంలోని 33/11 KV సబ్‌స్టేషన్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించి నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ ఆదినారాయణ, సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సైలు యాయాతి రాజు, రమేష్‌తో పాటు పోలీస్ సిబ్బంది రాజు, మురళి, చిరంజీవిలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు.

మరిన్ని వార్తలు