క్వాలిటీ జీఎం ఐనాల రవి కుమార్ సేవలు చిరస్మరణీయం
ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి
ఘనంగా రవి కుమార్ పదవీ విరమణ సన్మానం
భూపాలపల్లి టౌన్, నవంబర్ 21 ( విజయక్రాంతి ) : క్వాలిటీ జనరల్ మేనేజర్ ఐనాల రవి కుమార్(Quality General Manager Ainala Ravi Kumar) సేవలు చిరస్మరణీయమని సింగరేణి భూపాలపల్లి(Singareni Bhupalpally) ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సింగరేణి సంస్థలో క్వాలిటీ జనరల్ మేనేజర్ గా రవి కుమార్ 43 సంవత్సరాల సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా శనివారం జీఎం కార్యాలయంలో పదవీ విరమణ అభినందన సభను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జీఎం రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బొగ్గు పరిశ్రమలో ఐనాల రవి కుమార్ సంస్థ అభివృద్ధికి చేసిన సేవలు ఎల్లప్పుడు గుర్తుండిపోతాయని కొనియాడారు. ఆయన అంకితభావం, క్రమశిక్షణ, వృత్తి నిబద్ధత ఉద్యోగులందరికి ఆదర్శమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జీఎం రామన్ వి పాఠక్, ప్రాజెక్టు అధికారులు శ్యామ్ సుందర్, రామస్వామి, అదనపు ముఖ్య వైద్యాధికారి డాక్టర్ పద్మజ, ఐఈడి ఏజీఎం జ్యోతి, ఏరియా ఇంజనీర్, సాంబశివరావు, సర్వే అధికారి శైలేందర్, ఫైనాన్స్ మేనేజర్ రాజేశ్వరరావు, ఏజెంట్ తిరుపతి, ఏరియా, గని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.