మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
- యువత భవిష్యత్తును కాపాడుకోవాలి
- విద్యార్థులకు బాలల రక్షణ చట్టాలపై అవగాహన
- ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కంబంపాటి సూరిరెడ్డి
మణుగూరు, నవంబర్ 21 (విజయక్రాంతి): మాదకద్రవ్యాల వినియోగం(Drug use) యువత భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుందని, ప్రతి ఒక్కరూ వాటికి దూరంగా ఉండాలని మణుగూరు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కంబంపాటి సూరిరెడ్డి(Kambampati Surireddy, First-Class Magistrate of Manuguru) అన్నారు. మణుగూరు గుట్టుమల్లారంలోని విజ్ఞాన ప్రైవేట్ పాఠశాలలో(Vigyan Private School) లీగల్ సెల్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, బాలల రక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.
బాలలపై లైంగిక నేరాల నివారణకు పోక్సో చట్టం–2012 అమలులో ఉందని వివరించారు. బాల్యవివాహాల నిషేధ చట్టం–2006 ప్రకారం బాల్యవివాహాలు చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. పిల్లలకు విద్య, ఆరోగ్యం, రక్షణ కల్పించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం బాధ్యతని అన్నారు.
బాల కార్మికత్వం, బాలలపై హింస, వేధింపులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేరాల నివారణకు చట్టాలపై అవగాహన ఎంతో అవసరమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గురుకృష్ణ, లీగల్ ఎయిడ్ కౌన్సిలర్ పద్మావతి, న్యాయవాదులు, పాఠశాల కరస్పాండెంట్ సాంబరెడ్డి, ప్రిన్సిపాల్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.