ప్రైవేట్ బ్యాంక్ ఏజెంట్ చేతిలో మోసపోయిన మహిళలు
*25 మంది మహిళల వద్ద రూ.20 లక్షలు వసూలు చేసి పరార్!
*అప్పు మీరే తీసుకున్నారంటూ ఇంటికి వచ్చిన బ్యాంక్ వాళ్లు. బయటపడిన అసలు నిజం.
*న్యాయం చేయాలని ములకలపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించిన బాధితులు.
ములకలపల్లి,నవంబర్ 17 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడి పంచాయతీ పరిధిలోని సాయిరాంపురం గ్రామంలో ప్రైవేట్ బ్యాంకు ఏజెంట్ మోసం బయటపడింది. బాధిత మహిళలు తెలిపిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రైవేట్ బ్యాంకులలో ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు.బ్యాంకు లోన్లు ఇప్పిస్తానని,వాయిదాలు తానే కడతానని నమ్మబలికి,ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద సుమారు 25 మంది మహిళల వద్ద దాదాపు రూ.20 లక్షలు వసూలు చేసి పారిపోయాడని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు.
తాము అప్పు తీసుకోలేదని ఏజెంట్‌కే డబ్బులు ఇచ్చామని మహిళలు చెబుతున్నారు.ఇటీవల ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది నేరుగా గ్రామాలకు వచ్చి, ఇళ్లలోకి వచ్చి "అప్పు మీరే తీసుకున్నారు, మీరే కట్టాలి" అంటూ బలవంతం చేయడంతో అసలు నిజం బయటపడింది.దీంతో మోసపోయిన మహిళలు, గ్రామస్తులు కలిసి మంగళవారం ములకలపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. మోసం చేసి పారిపోయిన ఏజెంట్‌ను వెంటనే పట్టుకొచ్చి,వారి చేత డబ్బులు కట్టించి తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.పోలీసులు బాధితుల నుండి ఫిర్యాదు స్వీకరించి విచారణ చేస్తున్నారు.