మత స్వేచ్ఛపై దాడులెందుకు?

05-11-2026 | 03:14pm

ఇల్లెందు టౌన్, నవంబర్ 5 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో ఇటీవల ఏసుక్రీస్తుకు సంబంధించిన కరపత్రాలను (Christian Pamphlets) పంపిణీ చేస్తున్న ఇద్దరు మహిళలపై కొందరు దాడికి యత్నించడాన్ని తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సకినాల డేవిడ్ రాజు, ఇల్లెందు మండల పాస్టర్ల ఫెలోషిప్ అధ్యక్ష, కార్యదర్శులు యోబు, సువర్ణరాజులు తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మహిళలని కూడా చూడకుండా విచక్షణారహితంగా దాడికి యత్నించడంతో పాటు వీడియోలు చిత్రీకరించడం దారుణమన్నారు. భారత రాజ్యాంగం (Indian Constitution) ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను కల్పించిందని గుర్తు చేశారు. ఎవరి మతాన్ని వారు ఆచరించుకునే హక్కుతో పాటు తమ దేవుళ్లను పూజించుకునే, ప్రార్థనా మందిరాలకు వెళ్లే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందన్నారు.

రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకుంటూ క్రైస్తవ మతానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేస్తున్న మహిళలపై దాడికి యత్నించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. దాడికి పాల్పడిన వారిని కేవలం అరెస్టు చేయడమే కాకుండా చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు (Legal Action) తీసుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో డానియల్, జాన్ ప్రకాష్, అభిలాష్, జాన్, నతనియేలు, రమేష్, బాబురావు, నవీన్, సామ్సన్, జక్రయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు