విదేశీ విద్యార్థులకు కెనడా షాక్.. ఇంత మందికే ఛాన్స్

14-11-2026 | 05:01pm

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాలపై విధించిన పరిమితిని మరో మూడేళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయించింది. 2027 నుంచి 2029 వరకు ఏటా గరిష్ఠంగా 1.5 లక్షల మంది కొత్త అంతర్జాతీయ విద్యార్థుల రాకకు లక్ష్యాన్ని నిర్దేశించింది. కెనడా ప్రకటించిన కొత్త ఇమ్మిగ్రేషన్ ప్రణాళికలో ఈ నిర్ణయం భాగంగా ఉంది.

ఇటీవలి సంవత్సరాల్లో కెనడాలో అంతర్జాతీయ విద్యార్థులు, తాత్కాలిక నివాసితుల సంఖ్య పెరగడంతో గృహాల లభ్యత, ప్రజా సేవలు, మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వలసల సంఖ్యను నియంత్రించడంతో పాటు దేశంలోని వసతి, ప్రజా సేవల వ్యవస్థలకు ఊరట కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అలాగే ఏటా 2.2 లక్షల మంది కొత్త తాత్కాలిక విదేశీ ఉద్యోగుల రాకకు లక్ష్యాన్ని నిర్ణయించారు. విద్యార్థులు, ఉద్యోగులు కలిపి ఏటా 3.7 లక్షల మంది కొత్త తాత్కాలిక నివాసితుల రాకను లక్ష్యంగా పెట్టుకున్నారు.

కెనడాలో చదువుకోవాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థులు ఇకపై మరింత జాగ్రత్తగా తమ విద్యా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా యూనివర్సిటీల ఎంపిక, అడ్మిషన్లు, స్టడీ పర్మిట్ దరఖాస్తుల విషయంలో ముందస్తు ప్రణాళిక అవసరం. అయితే 1.5 లక్షల సంఖ్య కేవలం భారతీయ విద్యార్థులకు మాత్రమే కేటాయించిన కోటా కాదు. ప్రపంచంలోని అన్ని దేశాల విద్యార్థులకు వర్తించే మొత్తం లక్ష్యం.

కెనడాలో చదువుకోవాలనుకునే విద్యార్థులు తాజా ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, స్టడీ పర్మిట్ అర్హతలు, ఆయా విద్యాసంస్థల నిబంధనలను పరిశీలించి ముందుకు వెళ్లడం మంచిది. కెనడా తాజా నిర్ణయం విదేశీ విద్య కోసం ఆ దేశాన్ని ఎంచుకుంటున్న విద్యార్థులకు కీలక పరిణామంగా మారింది.

మరిన్ని వార్తలు