విద్యార్థిని భవిష్యత్తుతో ప్రైవేట్ స్కూల్ చెలగాటం!

14-11-2026 | 04:57pm

పేరు తప్పు.. పుట్టిన తేదీ తప్పు.. సర్టిఫికెట్ల కోసం 40 రోజులుగా తండ్రి పోరాటం!

వేంసూరు. సత్తుపల్లి. నవంబర్ 14. ( విజయక్రాంతి ) : ఒక తండ్రి తన కూతురిని ఉన్నత చదువులు(Higher Education) చదివించి మంచి స్థాయికి తీసుకెళ్లాలని ఎన్నో కలలు కంటాడు. ఆ కలలను నిజం చేయడానికి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడతాడు. కానీ పాఠశాల యాజమాన్యం(School Management) చేసిన నిర్లక్ష్యం కారణంగా ఆ చిన్నారి భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారితే ఆ తండ్రి ఆవేదన ఎవరికి చెప్పుకోవాలి?

వేంసూరు మండలం(Vemsur Mandal) మర్లపాడు గ్రామానికి చెందిన పిల్లి సుధాకర్(Pilli Sudhakar) తన కుమార్తె సిరివెన్నెలను గత రెండేళ్ల క్రితం న్యూ సాంగ్ పాఠశాలలో(New Song School) ఒకటి, రెండో తరగతులు చదివించారు. అనంతరం గురుకుల పాఠశాల(Residential School) ప్రవేశ పరీక్ష రాయగా పాల్వంచలో సీటు లభించింది. దీంతో కుమార్తెను గురుకుల పాఠశాలలో చేర్పించేందుకు సుధాకర్ సిద్ధమయ్యారు.

అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. గతంలో చదివిన న్యూ సాంగ్ పాఠశాల రికార్డుల్లో విద్యార్థిని పుట్టిన తేదీ తప్పుగా నమోదు చేయడంతో పాటు, ఇంటిపేరు 'పిల్లి'కి బదులుగా 'పూరేటి'గా నమోదు చేసినట్లు తండ్రి ఆరోపిస్తున్నారు. ఈ తప్పులను సరిచేసి అవసరమైన పత్రాలు అందించాలని గత 40 రోజులుగా పాఠశాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రికార్డుల్లో తప్పులు సరిచేయాలంటే తమ పాఠశాలలోనే చదవాలని, లేకపోతే ఇంటిపేరు అలాగే ఉంటుందని యాజమాన్యం చెబుతోందని సుధాకర్ ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రిన్సిపాల్ విదేశాలకు వెళ్లారని, ఆయన తిరిగి వచ్చే వరకు వేచి చూడాలని చెప్పడంతో పాటు, తాము సూచించిన ఫీజు చెల్లించి అదే పాఠశాలలో చదివించాలని షరతులు విధిస్తున్నారని వాపోతున్నారు.

ఒక చిన్నారి చదువుకు అడ్డంకులు ఎందుకు?

పాఠశాల రికార్డుల్లో జరిగిన తప్పులను సరిచేయాల్సిన బాధ్యత ఎవరిది? ఒక విద్యార్థిని భవిష్యత్తుకు అవసరమైన ధ్రువపత్రాల విషయంలో ఇన్ని రోజులు జాప్యం ఎందుకు? తప్పులను సరిచేయాలంటే అదే పాఠశాలలో చదవాలనే షరతు విధించడం ఎంతవరకు సమంజసం? అన్న ప్రశ్నలు ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

తన కుమార్తె భవిష్యత్తు కోసం ఒక తండ్రి 40 రోజులుగా పాఠశాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు స్పందించాలి.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి!

విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, విద్యార్థిని పాఠశాల రికార్డుల్లోని వివరాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం తప్పులను సరిచేసి అవసరమైన ధ్రువపత్రాలు అందేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల వ్యవహారశైలిపై సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే గుర్తింపు రద్దు చేసే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.


చదువు అనేది చిన్నారి హక్కు.. పాఠశాల రికార్డుల్లో తప్పులు ఆమె భవిష్యత్తుకు శాపంగా మారకూడదు! ఒక తండ్రి కన్నీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది.

మరిన్ని వార్తలు