ఇందిరమ్మ ప్రభుత్వంలో దీపావళి వెలుగులు
దమ్మపేట, నవంబర్ 09 (విజయక్రాంతి): దమ్మపేట మండల పరిధిలోని మొద్దులగూడెం, రెడ్యాలపాడు దురదపాడు, గండుగులపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్ల వద్ద నిర్వహించిన మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు. ముందుగా మొద్దులగూడెం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి కుటుంబాలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం అందించిన సొంత ఇంటిలో పండుగ జరుపుకుంటున్న సామాన్య కుటుంబాల ఆనందాన్ని పంచుకున్నారు.
ఏళ్ల తరబడి సొంత ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు పడిన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా సొంతింటి కల నెరవేరిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ గౌరవంగా జీవించే అవకాశం కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ కుటుంబాలకు సొంతింటి కలను నిజం చేసిన పేదల పక్షాన నిలిచి ఇళ్ల కేటాయింపులో ప్రత్యేక చొరవ చూపిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.