ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల కవి సమ్మేళనం

17-11-2026 | 07:05pm

చుంచుపల్లి, నవంబర్ 17(విజయక్రాంతి ): 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో(National Library Week) భాగంగా నాలుగవ రోజు జిల్లా కేంద్ర గ్రంథాలయం, భద్రాద్రి కొత్తగూడెంలో కవి సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, కార్యదర్శి కె. కరుణకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్‌టౌన్ ఎస్‌ఐ తిరుపతిరావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు కవులను ఆహ్వానించి, వారికి ఆతిథ్యం అందించడంతో పాటు తమ కవితలను వినిపించేందుకు చక్కని వేదికను కల్పించారు. కవులు తమ కవితల ద్వారా సమాజంలోని వివిధ అంశాలను, సామాజిక చైతన్యాన్ని, మానవీయ విలువలను అద్భుతంగా ఆవిష్కరించి సభికులను అలరించారు.

కవి సమ్మేళనం అనంతరం పాల్గొన్న కవులందరినీ నిర్వాహకులు అభినందించి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ కార్యదర్శి కె. కరుణకుమారి మాట్లాడుతూ.. మన జిల్లాలో ఇంతమంది ప్రతిభావంతులైన కవులు ఉండటం ఎంతో శుభపరిణామమని అన్నారు. విద్యార్థులు, పాఠకులకు కవిత్వం యొక్క ప్రాధాన్యతను తెలియజేయడంలో కవుల పాత్ర ఎంతో గొప్పదని,

ఒక విషయాన్ని కవి తన భావవ్యక్తీకరణతో, పదాల పొందికతో, మధురమైన వర్ణనతో ప్రజలకు అర్థమయ్యేలా వివరించగలరని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సాహిత్యాభివృద్ధికి, కవుల ప్రతిభను వెలికితీయడానికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రముఖ కవి డాక్టర్ దిలావర్ జిల్లా గ్రంథాలయ సంస్థకు రూ.5,000 విలువైన తెలంగాణ సాహిత్య పుస్తకాలను వితరణగా అందజేశారు. గ్రంథాలయానికి పుస్తకాలను అందించిన డాక్టర్ దిలావర్‌ను నిర్వాహకులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ దిలావర్, మండవ సుబ్బారావు, సంపటం దుర్గాప్రసాద్, ప్రసన్న, దుర్గాచారి, నాగవేణి, ఉమాదేవి, నాగచరణ్, గ్రేడ్-2 గ్రంథపాలకురాలు ఎస్. లలితకుమారి, జి. మణి మృదుల, రికార్డు అసిస్టెంట్ గీత, శాఖా గ్రంథపాలకులు మధు, వాణి, జానీ, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు