పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
- అర్హులందరికీ చేయూత అందిస్తాం
- కొత్త పెన్షన్ల తో పేద కుటుంబాలకు చేయూత
- ఎంపీ కడియం కావ్య
భూపాలపల్లి, నవంబర్ 17 (విజయ క్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్లు(Cheyutha Pensions) అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య అన్నారు. మంగళవారం భూపాలపల్లి అంబేద్కర్ భవన్లో నిర్వహించిన నూతన చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆమె లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. మహిళల సాధికారత కోసం ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, గృహజ్యోతి, మహాలక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. భూపాలపల్లి అభివృద్ధికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కృషి చేస్తున్నారని, వైద్య సదుపాయాల మెరుగుదల, రైల్వే లైన్, బైపాస్ రోడ్డు తదితర అభివృద్ధి పనులకు తన సహకారం అందిస్తానన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పెన్షన్ మంజూరుకు ఎవరైనా లంచం అడిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మహిళా సంఘాలను వడ్డీలేని రుణాలతో పాటు వివిధ వ్యాపార రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ఇప్పటికే రూ.73 కోట్ల నిధులు తీసుకువచ్చామని చెప్పారు.
కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీ, మండల పరిధిలో 1,277 కొత్త పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. వీరిలో 771 మంది వితంతువులు, 279 మంది దివ్యాంగులు, 132 మంది ఒంటరి మహిళలు, 95 మంది గీత కార్మికులు ఉన్నారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,536 నూతన పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు.ఈ
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ కొమరయ్య, వైస్ చైర్మన్ శ్రీనివాస్, డీఆర్డీఓ బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, కౌన్సిలర్లు, సర్పంచులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.