జియాకోమో ఫిలిటెక్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

17-11-2026 | 07:59pm

సీపీకి ఫిర్యాదు చేసిన బిజెపి 

ముకరంపుర, నవంబర్ 17 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో జరిగిన 'భారత్ సమ్మిట్ 2026'లో పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్ సెక్రటరీ జనరల్ జీయాకోమో ఫిలిటెక్ చేసిన రాజకీయ ప్రసంగంపై భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) కరీంనగర్ జిల్లా శాఖ తీవ్ర అభ్యంతరం చేస్తూ , విదేశీ ప్రతినిధిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ఈ మేరకు మంగళవారం రోజున బిజెపి జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం ఆధ్వర్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రధానంగా భారత్ సమ్మిట్ లో ఇటలీ విదేశీ ప్రతినిధి  జియాకోమో ఫిలిటెక్ ప్రసంగిస్తూ బహిరంగంగా "ఓట్ చోర్, గద్దీ చోద్" అనే రాజకీయ నినాదాన్ని లేవనెత్తి, దానిని ఇంగ్లీషులో "ఓటు దొంగ, నీ సీటును వదిలి వెళ్ళు"  అని అనువదించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.భారత భూభాగంలో జరిగిన కార్యక్రమంలో విదేశీ రాజకీయ సంస్థకు చెందిన సీనియర్ బాధ్యుడు భారత దేశ అంతర్గత రాజకీయ చర్చలొ జోక్యం చేసుకోవడం సరికాదని, జియాకోమో ఫిలిటెక్ కాన్ఫరెన్స్ వీసా, బిజినెస్ వీసా, టూరిస్ట్ వీసానా లేదా ఏ ఇతర కేటగిరీ వీసాపై భారత్‌లోకి ప్రవేశించారనేది నిగ్గుతేల్చాలని కోరారు.

సమ్మిట్‌లో ఆయన చేపట్టిన రాజకీయ కార్యకలాపాలు ఆ వీసా నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని తేలాలని డిమాండ్ చేశారు.'ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్, 2025' కింద వీసా నిబంధనలు, ఇమ్మిగ్రేషన్ చట్టాల ఉల్లంఘనపై విచారణ జరిపి, ఈ కార్యకలాపాలను ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించిన, కుట్ర పన్నిన లేదా సహకరించిన సదస్సు నిర్వాహకులు, స్పాన్సర్లు, సమన్వయకర్తలు బాధ్యులపై తగిన చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.. సిపిని కలిసిన వారిలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ సునీల్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు. ఉపాధ్యక్షులు, బిజెపి కిసాన్ మోర్చా , బీజేవైఎం , ఎస్టి , మైనార్టీ మోర్చా అధ్యక్షులు, సమీ పర్వేజ్ , సోషల్ మీడియా కన్వీనర్ వినోద్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు