420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ!
- ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి
- లేకుంటే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు
- బీఆర్ఎస్ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్‌రెడ్డి
పినపాక, నవంబర్ 17 (విజయ క్రాంతి): ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ పినపాక(BRS Party Pinapaka) మండల అధ్యక్షుడు పగడాల సతీష్‌రెడ్డి విమర్శించారు. ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి మూడేళ్లు గడుస్తున్నా వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని మండిపడ్డారు.
హామీల అమలుపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు మాయమాటలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన నిలబడి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు జరిగే వరకు నిరంతరం పోరాటం చేస్తామని సతీష్‌రెడ్డి స్పష్టం చేశారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాట్ల వాసుబాబు, గుమ్మడి గాంధీ, పోలిశెట్టి సత్తిబాబు, బత్తుల వెంకటరెడ్డి, బెడద సురేందర్, బుల్లిబాబు, ముక్కు నాసర్‌రెడ్డి, బూర రమేష్, చింతపాటి సత్యం, గుదిగొండ రామకృష్ణ, షేక్ జాంగీర్, మునిగెల సంతోష్, కాళ్ల చంటి, శివ, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.