బోడుకు పీఏసీఎస్‌ లేనట్టేనా..?

17-11-2026 | 08:02pm

- ప్రతిపాదనల్లో పేరు.. తుది జాబితాలో మొండిచేయి!

- కోయగూడెం, బొమ్మనపల్లికి చోటు.. బోడుకు ఎందుకు దక్కలేదు?

టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలంలోని బోడు ప్రాంతానికి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (Primary Agricultural Credit Society) ఏర్పాటు కలగానే మిగిలిపోనుందా? ప్రభుత్వ తాజా ప్రకటనతో బోడు ప్రాంత రైతుల్లో ఈ ప్రశ్న ఆందోళన కలిగిస్తోంది. బేతంపూడి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నుంచి కొత్త సంఘాల ఏర్పాటు కోసం విభజన ప్రతిపాదనలు రూపొందించిన సమయంలో బొమ్మనపల్లి, బోడు, గంగారం ప్రాంతాల పేర్లను ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది. అయితే తుది జాబితాలో కోయగూడెం, బొమ్మనపల్లి సంఘాలకు మాత్రమే చోటు దక్కడంతో బోడు పేరు గల్లంతైంది.

*రైతులకు తప్పని ఎదురుచూపులు*

బోడు ప్రాంతంలో వ్యవసాయంపై ఆధారపడే రైతులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ప్రత్యేక పీఏసీఎస్‌ ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యం ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పీఏసీఎస్‌ అందుబాటులో ఉంటే పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ సేవలు రైతులకు చేరువవుతాయని స్థానికులు ఆశించారు. ప్రతిపాదనల్లో పేరు ఉండి, తుది ప్రకటనలో లేకపోవడంతో తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

*బోడుకు న్యాయం జరిగేదెప్పుడు?*

బోడు ప్రాంతానికి ప్రత్యేక పీఏసీఎస్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను ప్రభుత్వం, సంబంధిత అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అసలు బోడు ప్రతిపాదనను ఎందుకు పక్కనపెట్టారు? ఏ ప్రాతిపదికన సంఘాలను ఎంపిక చేశారు? భవిష్యత్తులో బోడుకు ప్రత్యేక పీఏసీఎస్‌ ఏర్పాటు చేసే అవకాశం ఉందా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి బోడు ప్రాంత రైతుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు