రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్కు సింగరేణి విద్యార్థులు
ఇల్లందు, (విజయక్రాంతి): సింగరేణి పాఠశాల విద్యార్థులు తమ శాస్త్రీయ ప్రతిభను చాటారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన 32వ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్–2026 (National Children's Science Congress)లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఇల్లందు సింగరేణి పాఠశాల విద్యార్థులు రూపొందించిన ‘నేచురల్ పెస్టిసైడ్స్’ (Natural Pesticides) ప్రాజెక్టు ప్రథమ స్థానంలో నిలిచింది.
జిల్లాస్థాయిలో మొత్తం 105 ప్రాజెక్టులు పోటీపడగా, రాష్ట్రస్థాయికి ఎంపికైన ఆరు ప్రాజెక్టుల్లో సింగరేణి పాఠశాల ప్రాజెక్టు చోటు దక్కించుకుంది. దీంతో విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత సాధించారు.
ఈ సందర్భంగా ఇల్లందు ఏరియా జీఎం వి. కృష్ణయ్య విద్యార్థులతో పాటు గైడ్ టీచర్లు జి. ధనలక్ష్మి, టి. ఉషారాణిని అభినందించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని (Scientific Thinking) పెంపొందిస్తూ ప్రోత్సహించిన ప్రధానోపాధ్యాయులు డి. పూల్ సింగ్, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులను ప్రశంసించారు. రాష్ట్రస్థాయిలోనూ విజయం సాధించి సింగరేణికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి. మహేష్, హేప్సిబా, బి. రవీందర్, బి. వీరన్న, ఏ. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.