వి.బి.జి. రామ్ జీ పనుల్లో వేగం పెంచాలి

12-11-2026 | 01:39pm

ములుగు, నవంబర్ 12 (విజయక్రాంతి): వి.బి.జి. రామ్ జీ పథకం (VBG Ram Ji Scheme) కింద చేపట్టిన పనులను వేగవంతం చేసి, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (Additional Collector) స్థానిక సంస్థలు ఎం. సంపత్ రావుతో కలిసి జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలతో పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మండలాల వారీగా ఉపాధి హామీ పనుల పురోగతి, ఇంకుడు గుంతలు, బోరుబావుల రీఛార్జ్ పాయింట్లు, ఊట చెరువులు, పంట కుంటల నిర్మాణం తదితర అంశాలను సమగ్రంగా సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ (Water Conservation), భూగర్భ జలాల పెంపునకు దోహదపడే పనులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.

ఇంకుడు గుంతలు, బోరుబావుల రీఛార్జ్ నిర్మాణాలు, ఊట చెరువులు, పంట కుంటల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మండలాల వారీగా నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని, ప్రతి ఎంపీడీఓ తమ పరిధిలోని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

పనుల అమలులో జాప్యానికి తావులేకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఉపాధి హామీ పనుల అమలులో ఎలాంటి అలసత్వం, నిర్లక్ష్యం వహించకుండా ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు