గంజాయి చాక్లెట్లపై పోలీసుల హెచ్చరిక

12-11-2026 | 01:27pm

ఆలేరు, నవంబర్ 12 (విజయక్రాంతి): మాదక ద్రవ్యాలకు అలవాటుపడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, గంజాయి చాక్లెట్లతో పాటు ఎలాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దని పోలీస్ అధికారులు విద్యార్థులకు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా (Police Surveillance) ఏర్పాటు చేసిందని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ, మంగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలేరు పట్టణంలోని దినేష్ గార్డెన్‌లో నిర్వహించిన విద్యార్థి యువసమ్మేళనానికి ఆలేరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని వివిధ పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాదక ద్రవ్యాల దుష్పరిణామాలు, విద్య ప్రాముఖ్యత, వ్యక్తిత్వ వికాసం, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించారు.

ఏఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. నేటి సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుకు పెను ప్రమాదంగా మారుతోందన్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో గంజాయి చాక్లెట్ల వంటి మత్తు పదార్థాలు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చే ప్రమాదం ఉందని, ఎవరైనా ఇచ్చినా వాటిని తీసుకోవద్దని సూచించారు.రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, మత్తు పదార్థాల విక్రయాల గురించి తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల విద్యార్థుల ఆరోగ్యం, చదువు, కుటుంబ జీవితం దెబ్బతింటాయని హెచ్చరించారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు గ్రామగ్రామాన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థులు చదువుపై ప్రత్యేక దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని ఏఎస్పీ సూచించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు ఎన్నో ఉన్నాయని, పట్టుదలతో చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.డీఎస్పీ పి. శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ.. విద్యార్థులు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తల్లిదండ్రులను, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పటికీ మర్చిపోవద్దని సూచించారు. తమ కోసం ఎన్నో కష్టాలు పడుతూ విద్యను అందిస్తున్న తల్లిదండ్రులను గౌరవించాలని అన్నారు. తల్లిదండ్రులు ఉన్నత ఉద్యోగాల్లో లేకపోయినా తమ కష్టార్జితంతో పిల్లలను మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్నారని గుర్తు చేశారు.

సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు, ఇతర సామాజిక దుష్ప్రభావాల నుంచి యువత దూరంగా ఉండాలంటే ముందుగా బలమైన వ్యక్తిత్వాన్ని, మంచి నడవడికను అలవర్చుకోవాలని సూచించారు. మానసికంగా దృఢంగా, నైతిక విలువలతో ఉన్న విద్యార్థులు చెడు అలవాట్లకు ఆకర్షితులు కారని పేర్కొన్నారు.ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉద్యోగాలే గొప్పవి కావని, ఎలక్ట్రీషియన్, స్వీపర్, అటెండర్ ఇలా ఏ వృత్తిలో ఉన్నా నిజాయితీగా పనిచేస్తూ సమాజంలో గౌరవంగా జీవించడమే గొప్ప విషయమని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి తల్లిదండ్రులకు, సమాజానికి, దేశానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు.

రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు పులిపలుపుల మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. తమ సంస్థ ప్రధాన ఆశయాలు జ్ఞానం, శీలం, ఏకతా అని వివరించారు. కేవలం చదువుతోనే కాకుండా మంచి వ్యక్తిత్వం, సామాజిక అవగాహన, ఐక్యతతో కూడిన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.గత ఆరేళ్లుగా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అవసరమైన వారికి వైద్య సేవల్లోనూ సహకారం అందిస్తున్నామని చెప్పారు. జ్ఞానం ఉన్నతిని అందిస్తుందని, శీలం వ్యక్తిత్వాన్ని బలపరుస్తుందని, ఏకతా సమాజానికి శక్తినిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, నైతిక విలువలు పెంపొందించడమే కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని వివరించారు.ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించిన మంగ ఫౌండేషన్, రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులకు పోలీస్ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సంస్థ ప్రతినిధులు, అతిథులను సత్కరించారు.

ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట డీఎస్పీ పి. శ్రీనివాస్ నాయుడు, ఏఎస్పీ లక్ష్మీనారాయణ, యాదగిరిగుట్ట సీఐ ఎం. శంకర్ గౌడ్, ఆలేరు ఎస్‌హెచ్‌ఓ ఎస్. ఉదయకిరణ్, ఎస్‌ఐ ఎన్. వినయ్, రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పులిపలుపుల మహేష్ గౌడ్, బిజ్జారి పోశెట్టి, మంగ అరవింద్, మంగ నరసింహులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు