నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ఇల్లందు, (విజయక్రాంతి): సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకతతో పాటు బొగ్గు నాణ్యత ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ వి.కృష్ణయ్య అన్నారు. గురువారం ఇల్లందు ఏరియా జీఎం కార్యాలయంలో బొగ్గు నాణ్యత వారోత్సవాలను (Coal Quality Week) నాణ్యత పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో అగ్రగామి బొగ్గు ఉత్పత్తి సంస్థగా సింగరేణి (Singareni Collieries Company Limited) దేశంలోని వివిధ సంస్థలకు, ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గును సరఫరా చేస్తూ దేశ ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రస్తుత పోటీ మార్కెట్‌లో ఇతర సంస్థలకు దీటుగా నిలవాలంటే బొగ్గు నాణ్యత ప్రమాణాలను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి, సరఫరాను ప్రతి ఉద్యోగి తన బాధ్యతగా భావించాలని సూచించారు.
వినియోగదారుల విశ్వాసాన్ని పొందడంతో పాటు నాణ్యమైన బొగ్గు ద్వారా తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి (Power Generation) సాధ్యమవుతుందని, తద్వారా వినియోగదారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అనంతరం ఇల్లందు ఏరియాలోని జేకే ఉపరితల గని, కోయగూడెం ఉపరితల గనుల్లోనూ బొగ్గు నాణ్యత వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులతో నాణ్యత ప్రమాణాల ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌వో టు జీఎం జాకీర్ హుస్సేన్, డీజీఎం (ఐఈడీ) ప్రభాకర్ రావు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్, బొగ్గు నాణ్యతాధికారి రామదాసు, ఏరియా ఇంజనీర్ లక్ష్మణమూర్తి, డీవై (సివిల్) వినయ్ సాగర్, అధికారులు దిలీప్ కుమార్, రామమూర్తి, శివవీరకుమార్, సుధాకర్, నరసింహారావు, చైతన్య, ప్రణతి, జగదీష్, అధికారుల సంఘం నాయకుడు నాగేశ్వర్ రావు, గుర్తింపు సంఘం నుంచి లచ్చిరం, ప్రాతినిధ్య సంఘం నుంచి యాదగిరితో పాటు పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.