నాగర్ కర్నూల్లో ఏసీబీ మెరుపు దాడులు!
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు (Anti-Corruption Bureau) మెరుపు దాడులు నిర్వహించారు. ఇరిగేషన్ అండ్ సీఏడీ శాఖలో సర్కిల్-1, డివిజన్-3, సబ్ డివిజన్-3 పరిధిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆర్. రాగిరి సత్యనారాయణ గౌడ్‌పై ఆదాయానికి మించిన ఆస్తులు (Disproportionate Assets) కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.
అధికారి నివాసంతో పాటు కార్యాలయం, ఇతర ప్రాంతాల్లో మొత్తం 10 ఏసీబీ బృందాలు ఏకకాలంలో విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. జిల్లా కేంద్రంలోని డీఈ కార్యాలయంలో అధికారులు కీలక పత్రాలు, ల్యాప్‌టాప్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు.
అధికారికి సంబంధించిన స్థిర, చరాస్తుల వివరాలు, బ్యాంకు ఖాతాల లావాదేవీలు, ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులపై ఆరా తీస్తున్నారు. ఆదాయ వనరులు, ఆస్తుల విలువ, వాటికి సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నారు. 10 బృందాలతో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సోదాలు కొనసాగుతుండగా.. తనిఖీలు పూర్తయిన తర్వాత ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.