పోరాటాల బాటలో భూక్యా రమేష్ నాయక్

18-10-2026 | 05:30am

విద్యార్థి నేత నుంచి కార్మిక నేతగా మారి..

ఇల్లెందు టౌన్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): అతనో సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాడు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి, సాధారణ విద్యార్థి సంఘ సభ్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. రాష్ట్రస్థాయి విద్యార్థి నాయకుడిగా(State-level student leader) ఎదిగాడు రమేష్ నాయక్. ఆ తర్వాత సింగరేణిలో ఉద్యోగం పొందడంతో కార్మిక ఉద్యమంలోకి అడుగుపెట్టి తన నాయకత్వ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.

2004లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన అనంతరం, ఆ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘమైన తెలుగునాడు విద్యార్థి సమాఖ్యలో సభ్యుడిగా చేరారు. విద్యార్థులు, యువతకు సేవ చేయాలనే ఆసక్తితో విద్యార్థి ఉద్యమంలో అడుగుపెట్టారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుపై ఉన్న అభిమానం, చంద్రబాబునాయుడు నాయకత్వంపై ఉన్న నమ్మకం ఆయన్ని విద్యార్థి రాజకీయాల వైపు నడిపించాయి.

విద్యార్థి సంఘంలో చేరిన తొలినాళ్లలో పెద్దగా రాజకీయ ప్రోత్సాహం లేకపోయినా రమేష్ వెనక్కి తగ్గలేదు. తన స్నేహితులు కలవల అన్వేష్, కడారి నటరాజ్ తదితరులతో కలిసి పాఠశాలలు, కళాశాలలను సందర్శిస్తూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ఉద్యమాలు చేపట్టారు. 

ఆయన చురుకుదనం, పోరాట స్ఫూర్తిని గమనించిన పులిగండ్ల మాధవరావు తదితర నాయకులు రమేష్‌ను ప్రోత్సహించారు. అక్కడి నుంచి ఆయన నాయకత్వ ప్రయాణం అంచెలంచెలుగా ముందుకు సాగింది. సాధారణ సభ్యుడు నుంచి మండల అధ్యక్షుడిగా, నియోజకవర్గ ఇన్‌చార్జిగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ విద్యార్థి సమస్యలపై పోరాటాలు చేశారు.

సమస్యల పరిష్కారం కోసం నిత్య పోరాటం

ఇల్లందు డిగ్రీ కళాశాలలో సైన్స్ గ్రూపులు ఏర్పాటు చేయాలని, జూనియర్ కాలేజీని అభివృద్ధి చేయాలని, పట్టణంలోని మెయిన్ రోడ్ హైస్కూల్‌కు ప్రహరీ నిర్మించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తూ అనేక ఆందోళనలు నిర్వహించారు. విద్యార్థులపై అధిక ఫీజుల భారం వేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల వైఖరికి వ్యతిరేకంగానూ ఉద్యమించారు.ఒక ప్రైవేట్ స్కూల్‌లో అధిక ఫీజుల అంశంతో పాటు స్వాతంత్య్ర దినోత్సవాన్ని సైతం నిర్వహించకపోవడాన్ని నిరసిస్తూ, 144 సెక్షన్ అమల్లో ఉన్న సమయంలో తెలుగునాడు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఆ ఉద్యమంలో అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారు.

తనతో ఉన్న వారినీ ప్రోత్సహిస్తూ..

తాను ఎదగడమే కాకుండా తనతో కలిసి విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన యువకులను కూడా రాజకీయంగా, సామాజికంగా ప్రోత్సహించాలనే ప్రయత్నం చేశారు. వారిలో కొందరు తర్వాత కాలంలో వార్డు కౌన్సిలర్లుగా, సర్పంచులుగా ఎన్నికయ్యారు. కాగా విద్యార్థులు, యువత సమస్యలపై ఉద్యమాలు కొనసాగిస్తున్న సమయంలో రమేష్ నాయక్ జీవితంలో మరో కీలక మలుపు వచ్చింది. సింగరేణి సంస్థలో ఉద్యోగం లభించింది.

ఉద్యోగిగా గనిలో అడుగుపెట్టిన తర్వాత కూడా ఆయనలోని నాయకత్వ లక్షణాలు ఆగిపోలేదు. విద్యార్థుల సమస్యలపై పోరాడిన అనుభవాన్ని కార్మికుల సమస్యల పరిష్కారం వైపు మళ్లించారు.సింగరేణి కార్మిక ఉద్యమంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్‌లో చేరి కార్మిక సమస్యలపై పనిచేయడం ప్రారంభించారు. అతి తక్కువ కాలంలోనే కార్మికుల మధ్య గుర్తింపు సంపాదించి పీవీకే5 ఇంక్లైన్ ఏఐటీయూసీ పిట్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. పోరాటంతోనే సమస్యల పరిష్కారం సాధించేందుకు ప్రయత్నించడం రమేష్ పని విధానంగా ఆయన మిత్రులు పేర్కొంటారు. 

మరిన్ని వార్తలు