285 గ్రామాల్లో భూ సర్వే పూర్తి
- అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు జారీ
- వచ్చే నెలాఖరుకు మొదటి దశ పూర్తికి కసరత్తు
- కొత్తగా 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లు
- రెవెన్యూ అధికారుల సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
అక్టోబర్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో భూ సమస్యలు, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రతి భూకమతానికి కచ్చితమైన హద్దులు నిర్ణయించి, భూ యాజమాన్య హక్కులపై స్పష్టత కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వేను మూడు దశల్లో పూర్తి చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) తెలిపారు.
ఇప్పటికే 285 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేసి, భూ యజమానుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఇప్పటికే ఉన్న 411 రోవర్లకు అదనంగా మరో 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారు చేసినట్లు మంత్రి వెల్లడించారు. భూ సమస్యలు లేని తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
శనివారం సచివాలయంలో రెవెన్యూ అధికారులతో భూ సర్వే పురోగతిపై నిర్వహించిన సమీక్ష లో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 10,954 రెవెన్యూ గ్రామాలకు గానూ తొలి దశలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో సర్వే చేపట్టినట్లు తెలిపారు. జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేయడంతో పాటు, నక్షాలు అందుబాటులో లేని గ్రామాలను కూడా చేర్చి, మొత్తం 2,720 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ 1936 నాటి నిజాం కాలం సర్వే రికార్డులే ప్రధాన ఆధారాలుగా ఉన్నాయని, కాలక్రమేణ భూముల విభజనలు, సర్వే నంబర్ల ఉపవిభాగాలు పెరగడం, పట్టణీకరణ విస్తరించడం, పరిపాలనా సరిహద్దుల్లో మా ర్పులు చోటుచేసుకోవడం వంటి కారణాలతో భూముల అసలు హద్దులపై స్పష్టత కొరవడిందన్నారు.
ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయ పద్ధతుల్లో సమగ్ర రీసర్వే చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. గతంలో భూము ల కొలతలకు ఉపయోగించిన గొలుసులు, కర్రలు, క్రాస్స్టాఫ్, మెజరింగ్ టేపుల వంటి సంప్రదాయ పరికరాలకు స్వస్తి పలుకుతూ డీజీపీఎస్, రోవర్లు, జీఐఎస్, క్యూజీఐఎస్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని చెప్పారు.
పాలేరులో త్వరలో భూదార్ పట్టాల పంపిణీ..
ఆధార్ తరహాలో ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపునిచ్చేలా భూదార్ కార్డులు జారీ చేస్తామని మంత్రి తెలిపారు. తన సొంత నియోజకవర్గమైన పాలేరులోని నేలకొండపల్లి మండలం కొంగర గ్రామ పరిధిలో మొత్తం 665 ఎకరాల్లో వందశాతం రీసర్వే విజయవంతంగా పూర్తిచేశామ ని, త్వరలో భూదార్ పట్టాల పంపిణీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రాంతంలో 1948 నాటికి సుమారు 40 లక్షల సర్వే నంబర్లు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 2 కోట్ల 29 లక్షలకు చేరిందన్నారు.
ప్రతి సర్వే నంబర్కు భూదార్ నంబర్ కేటాయించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. రీసర్వే ద్వారా ప్రతి భూకమతానికి కచ్చితమైన సరిహద్దులు, ప్రత్యేక సర్వే పటాలు రూపొందిస్తున్న ట్లు చెప్పారు. తద్వారా భూ యాజమాన్య హ క్కులపై స్పష్టత పెరగడంతో పాటు భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సమస్యలను తగ్గించేందుకు వీలవుతుందన్నారు.
పట్టాదారులకు ముందే నోటీసులివ్వండి
సర్వేకు ముందు సంబంధిత పట్టాదారులకు నోటీసులు ఇవ్వాలని అధికారులకు సూ చించారు. ప్రభుత్వ భూములకు స్పష్టమైన మార్కింగ్ చేయాలని, గ్రామకంఠం హద్దులను నిర్ధారించిన తర్వాతే సర్వే చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు, గ్రామకం ఠం పరిధుల విషయంలో గందరగోళానికి తావుండరాదని స్పష్టం చేశారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో భూ యజమానుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, పరిశీలించి పరిష్కరించాలని పేర్కొన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా కోణంలోనే ఆలోచించాలని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు.