దసరా పిలుస్తోంది!
- పల్లెబాట పట్టిన పట్నం ప్రజలు
- హైదరాబాద్ చుట్టూ హైవేల్లో రద్దీ
- కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
- జాతీయ రహదారుల్లో బారులు తీరిన వాహనాలు
- విజయవాడ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
- చౌటుప్పల్ వద్ద 3 కి.మీ. మేర నిలిచిన వాహనాలు
- చౌటుప్పల్ దాటడానికే 45 నిమిషాలకు పైగా సమయం
- హైదరాబాద్ వరంగల్ మార్గంలోనూ అదే పరిస్థితి
- ఉప్పల్ నల్లచెరువు బస్టాండ్ వద్ద ట్రాఫిక్ కష్టాలు
- మరోపక్క దసరా ప్రయాణికులపై ప్రైవేట్ ‘దోపిడీ’
సిటీ బ్యూరో, అక్టోబర్ 17 (విజయక్రాంతి): దసరా పిలిచింది.. పట్నం కదిలింది.. హైదరాబాద్లోని జనం పల్లెబాట పట్టారు. నిత్యం వాహన రాకపోకలు, జన సంచారంతో బిజీగా ఉండే నగరం లోని రోడ్లు వెలవెలబోతున్నాయి. ఆదివారం సద్దులు, మంగళవారం దసరా వేడుకలు ఉండడంతో చాలామంది సొంతూళ్లకు ప్రయాణం కట్టారు. భాగ్యనగరం వీడి స్వగ్రామాలకు బయలుదేరారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
నగరం శివారులోని ప్రధాన రహదారుల్లో వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. విజయవాడ హైవేలో చౌటుప్పల్ సమీపంలో కిలోమీటర్ల పొడవునా వాహనాలు స్తంభించిపోయాయి. దాదాపు గంటకు పైగా నిరీక్షిస్తే గానీ.. వాహనం ముందుకు నడిచే పరిస్థితి లేదు. వరంగల్ రూట్లోనూ అదే తీరు.. ఉప్పల్ నల్లచెరువు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బెంగళూరు హైవేలోనూ ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు.
పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు ప్రకటించడంతో నగరవాసులు కుటుంబసమేతంగా పల్లెబాట పట్టారు. పం డుగ రద్దీతో నగరంలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్,జూబ్లీ బస్ స్టేషన్ తో పాటు ప్రధాన కూడళ్లయిన ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, కూకట్పల్లి వద్ద ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. సికింద్రా బాద్, కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బస్సులు, రైళ్ల కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్.. రెట్టింపు చార్జీలు
ఆర్టీసీ బస్సుల్లో సీట్లు దొరక్కపోవడం, రైళ్లలో తత్కాల్ టికెట్లు కూడా లభించకపోవడంతో చాలామంది ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్, ఇతర వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ యాజమాన్యాలు సాధారణ చార్జీల కంటే రెండు మూడు రేట్లు అధికంగా వసూలు చేస్తున్నాయి. చార్జీలతో పాటు ప్రయాణికుల లగేజీకి కూడా అదనపు మొత్తాలు గుంజుతున్నారని, రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్యాసింజర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైవేలపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్..
సొంత వాహనాలు, కార్లలో గ్రామాల వైపు వెళ్లేవారి సంఖ్య పెరగడంతో హైదరాబాద్ చుట్టుపక్కల జాతీయ రహదారులపై వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విజయవాడ నేషనల్ హైవేలో ఎల్బీనగర్, హయత్నగర్ దాటిన తర్వాత చౌటుప్పల్ వద్ద 3 కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయాయి. లక్కారం నుంచి వలిగొండ క్రాస్ రోడ్డు వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
ట్రాఫిక్ దాటుకుని బయటపడడానికి దాదాపు 45 నిమిషాలు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక వరంగల్ హైవేలోనే ఇదే పరిస్థితి ఉంది. ఉప్పల్ నుంచి నల్ల చెరువు వరకు, ఆపై కూడా వాహనాలకు ట్రాఫిక్ ఆటంకాలు తప్పడం లేదు. బెంగళూరు హైవే మార్గంలో శంషాబాద్, ఫరూఖ్నగర్ మండలం రాయికల్ టోల్గేట్ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఒకవైపు నగరంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడగా, మరోవైపు సొంతూళ్లకు వెళ్లే క్రమంలో ఎదురవుతున్న రవాణా ఇబ్బందులు ప్రయాణికులను అసహనానికి గురిచేస్తున్నాయి. టోల్గేట్ల వద్ద ఫాస్టాగ్ స్కాన్ ప్రక్రియను వేగవంతం చేసి, పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని ప్రజలు కోరుతున్నారు. ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా, కుటుంబసమేతంగా బతుకమ్మ ఆడటానికి, దసరా పండుగను ఆత్మీ యులతో కలిసి జరుపుకోవడానికి ఊళ్లకు చేరుకుంటుండటంతో పల్లెల్లో పండుగ ఉత్సాహం అప్పుడే మిన్నంటింది.
ప్రత్యేక సర్వీసులున్నా తప్పని సీట్ల కొరత..
పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ఆర్టీసీ దాదాపు 7,000 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. గ్రేటర్ ఆర్టీసీ సైతం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అదన పు సర్వీసులను నడుపుతోంది. అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా ఉండటంతో ఆర్టీసీ బస్సు ల్లో తీవ్ర సీట్ల కొరత ఏర్పడింది. బస్టాండ్లలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవే క్షించి, రద్దీకి తగినట్లుగా మరిన్ని అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.