హైదరాబాద్‌లో ఆర్ధోపెడిక్ ట్రామా సమ్మిట్

18-10-2026 | 05:20am
  1. సదసుకు వెయ్యి మందికి పైగా వైద్య నిపుణుల హాజరు
  2. ఎముకల విరుగుళ్లు, సంక్లిష్ట గాయాల చికిత్సపై విస్తృత చర్చలు

హైదరాబాద్, అక్టోబర్ 17(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలు, ఎత్తు నుంచి పడిపోవడం వంటి ఘటనల్లో సంభవించే ఎముకల విరుగుళ్లు, సంక్లిష్ట కీళ్ల గాయాలకు మెరుగైన చికిత్స అందించడంలో ఆధునిక సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థోపెడిక్ ట్రామా వైద్యరంగంలో(Field of Orthopedic Trauma Medicine) వస్తున్న నూతన పరిణామాలు, అధునాతన శస్త్రచికిత్స పద్ధతులు, రోబోటిక్ సాంకేతికతపై చర్చించేందుకు హైదరాబాద్ వేదికగా ఆర్థోపెడిక్ ట్రామా సమ్మిట్ 2026 అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు.

ఈ సదస్సులో 1,000 మందికి పైగా ప్రతినిధులు, 120 మంది వైద్య నిపుణులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వహణ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ కాశా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు, ఇతర తీవ్ర గాయాల కారణంగా ఎముకలు విరగడం, కీళ్లకు నష్టం కలగడం, కంటిభాగంలోని ఎముకలకు గాయాలు కావడం, ఒకేసారి పలు ఎముకలు విరగడం వంటి సమస్యలకు చికిత్స అందించడం వైద్యులకు సవాలుగా మారుతోంది.

ఇలాంటి సందర్భాల్లో సరైన వైద్య నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అధునాతన శస్త్రచికిత్స నైపుణ్యాలు, ఆధునిక ఇమేజింగ్ సాంకేతికత, నావిగేషన్ వ్యవస్థలు, రోబోటిక్ పరిజ్ఞానం అవసరమవుతున్నాయి. తాజా వైద్య విధానాలపై నిరంతర శిక్షణ పొందడం ద్వారా చికిత్సా ప్రమాణాలను మెరుగుపరచవచ్చనే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు.

సాంప్రదాయ ఆర్థోపెడిక్ ట్రామా చికిత్సా విధానాలకు, ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చెందుతున్న చికిత్సా పద్ధతులకు మధ్య సమన్వయం పెంపొందించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యమన్నారు. . వైద్యులు తమ అనుభవాలను పంచుకోవడం, సంక్లిష్ట కేసులపై చర్చించడం, కొత్త చికిత్సా విధానాలను నేర్చుకోవడం ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రోత్సహించనున్నారన్నారు.

ఈ సదస్సులో బ్రిటన్, ఇజ్రాయెల్, థాయ్లాండ్, దక్షిణ కొరియా దేశాలకు చెందిన నలుగురు అంతర్జాతీయ వైద్య నిపుణులతో పాటు దేశంలోని 75 మందికి పైగా ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు పాల్గొన్నారు. భారత ఆర్థోపెడిక్ వైద్యరంగంలో విశేష సేవలందించిన ముంబయికి చెందిన సీనియర్ వైద్యుడు డాక్టర్ డీడీ తన్నాను ఈ సదస్సులో గౌరవించారు.   

ఏఓ ట్రామా ఆసియా పసిఫిక్ ఛైర్ డాక్టర్ మందీప్ ధిల్లాన్ ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. కాగా వైద్య పరిశోధనలు, విద్యాపరమైన ప్రతిభను ప్రోత్సహించేందుకు ‘ఓటీఎస్ పినాకిల్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సదస్సు నిర్వహణ అధ్యక్షులుగా డాక్టర్ శ్రీనివాస్ కాశా, డాక్టర్ అశోక్ గవాస్కర్, డాక్టర్ ప్రణవ్‌షా, డాక్టర్ అతుల్ పాటి ల్, డా. ప్రదీప్ నేమాడే, డా. అభయ్ ఎల్హెన్స్, డా. అశోక్ రాజు జి. వ్యవహరించారు.

మరిన్ని వార్తలు