ఈఎంఆర్ఎస్ విద్యార్థులను అభినందించిన కలెక్టర్

17-11-2026 | 10:43pm

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విద్యార్థి, ఉపాధ్యాయ బృందం

కామారెడ్డి, నవంబర్ 17 (విజయక్రాంతి): ఈఎంఆర్ఎస్ గాంధారి పాఠశాల విద్యార్థులు సాధించిన విశేష విజయాలు సంస్థకు గర్వకారణంగా నిలిచాయి. పాఠశాలకు చెందిన విద్యార్థి కె. నవీన్ నీట్-2026 పరీక్షలో అర్హత సాధించి ప్రభుత్వ వైద్య కళాశాల, సిద్ధిపేటలో ప్రవేశం పొందగా, ఎల్. సంతోష్ తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఈఎంఆర్ఎస్ సైన్స్ విభాగంలో టాపర్‌గా నిలిచి ప్రతిభ చాటుకున్నారు. వీరిద్దరూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే అరుదైన అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు. 

ఈ నేపథ్యంలో కె. నవీన్, డీసీఓ కామారెడ్డి శ్రీనివాస్ స్వామి, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ అమర్ సింగ్, ఈఎంఆర్ఎస్ గాంధారి ప్రిన్సిపాల్ రవీంద్ర కుమార్, టీజీటీ ఇంగ్లీష్ ఉపాధ్యాయులు గోపాల్ మండల్, ఈఎంఆర్ఎస్ గాంధారి ఎస్ఎస్ఏ ఎం. రవి లు మంగళవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌(Collector Ashish Sangwan)ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి విద్యార్థుల విజయాలను వివరించారు. విద్యార్థుల ప్రతిభను జిల్లా కలెక్టర్ అభినందిస్తూ, కె. నవీన్ నీట్‌లో అర్హత సాధించి ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశం పొందడం ఎంతో ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఎల్. సంతోష్ రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడం పాఠశాలకు గర్వకారణమని కొనియాడారు.

గిరిజన విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సమగ్ర వికాసానికి తన సంపూర్ణ సహకారం అందిస్తానని, అవసరమైన అన్ని విధాలుగా తోడ్పాటు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థుల ఈ విజయాలు వారి కృషి, పట్టుదలతో పాటు ఉపాధ్యాయుల నిరంతర మార్గదర్శకత్వం, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు, సమగ్ర అభివృద్ధిని అందిస్తూ మరిన్ని విజయాలు సాధించే దిశగా ఈఎంఆర్ఎస్ గాంధారి నిరంతరం కృషి చేస్తోందనీ వారు తెలిపారు.

మరిన్ని వార్తలు