బాల్యవివాహాలు లేని సమాజ నిర్మాణానికి కృషి చేయాలి
అవగాహన కార్యక్రమ గోడ పత్రికల ఆవిష్కరణలో ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్
భూపాలపల్లి టౌన్, నవంబర్ 17 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాల్యవివాహాల నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన 100 రోజుల ప్రత్యేక అవగాహన ప్రచారానికి సంబంధించిన గోడ పత్రికలను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య(MP Kadiyam Kavya), జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జాయింట్ కలెక్టర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు అప్పం కిషన్ చేతుల మీదుగా డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ తిరుపతి శాస్త్రాల ఆధ్వర్యంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 రోజుల ప్రచార కార్యక్రమంలో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాలికల విద్య, బాలల హక్కులు, రక్షణ, భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి బాలికకు విద్య, ప్రతి చిన్నారికి సురక్షిత బాల్యం కల్పించడమే ఈ ప్రచార ప్రధాన లక్ష్యమని, బాల్య వివాహాల రహిత సమాజ నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షేర్ ఎన్జీఓ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సోషల్ మొబిలైజర్స్ బోయిని శ్రీజ, వెన్నెల, స్వప్న, సుమన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.