ఇన్‌స్టాలో డాక్టర్‌గా పరిచయం.. పెళ్లి డ్రామా.. లక్షల్లో మోసం

28-11-2026 | 05:05pm

హైదరాబాద్: సోషల్ మీడియాలో పరిచయం.. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మబలుకుడు.. ఆపై అత్యవసరాల పేరుతో డబ్బులు, బంగారం వసూలు. ఇలా ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని(Software employee) మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. నకిలీ డాక్టర్ అవతారమెత్తి యువతిని బురిడీ కొట్టించిన వ్యక్తితో పాటు, అతడికి సహకరించిన తల్లిని కూడా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు(Cyberabad Cyber ​​Crime Police) అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో జజుల గుణవంత్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఓ గిటారిస్ట్, మోడల్‌కు చెందిన ఫొటోలను ఉపయోగించి నకిలీ ఖాతా సృష్టించాడు. తాను సంపన్న వైద్యుడినని నమ్మించాడు. కొంతకాలం పరిచయం పెంచుకున్న అనంతరం పెళ్లి చేసుకుంటానని యువతికి హామీ ఇచ్చాడు.

యువతి నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు కుటుంబంలో అత్యవసర పరిస్థితులంటూ వివిధ కారణాలు చెప్పి విడతలవారీగా రూ.10.05 లక్షలు తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా ర్యాపిడో కొరియర్ ద్వారా బంగారు ఆభరణాలను కూడా తెప్పించుకున్నాడు. బాధితురాలి హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు, ఓటీపీలను దుర్వినియోగం చేసి మరో రూ.2.16 లక్షల రుణం పొందినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ వ్యవహారంలో నిందితుడి తల్లి పటూరి సురేఖ కూడా సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పెళ్లి సంబంధం నిజమేనని యువతిని నమ్మించడంతో పాటు, మోసం ద్వారా వచ్చిన డబ్బును డిజిటల్ చెల్లింపుల ఖాతాల్లో స్వీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రధాన నిందితుడు గుణవంత్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా, అతడి తల్లి సురేఖను కూడా అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు బంజారాహిల్స్‌లోని ఓ జ్యువెలరీ షాపులో తాకట్టు పెట్టిన సుమారు 20 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 8.37 గ్రాముల బంగారు గొలుసు, 12 గ్రాముల బ్రాస్‌లెట్ ఉన్నాయి. ఈ కేసులో మరో నిందితుడు, గుణవంత్ బంధువు బొరుగుంట లోకేశ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

గతంలోనూ గుణవంత్‌పై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో రూ.20 లక్షల మోసానికి సంబంధించి కేసు నమోదైనట్లు వెల్లడించారు. సోషల్ మీడియా, మ్యాట్రిమోనీ వేదికలపై పరిచయమయ్యే వ్యక్తుల వివరాలను నిర్ధారించుకోకుండా నమ్మవద్దని పోలీసులు సూచించారు. ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు