మియాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

21-11-2026 | 04:44pm

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): మియాపూర్ పోలీస్ స్టేషన్(Miapur Police Station) పరిధిలోని న్యూ హఫీజ్‌పేటలో శనివారం భారీ అగ్నిప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ పెయింట్ షాపు(Paint Shop)లో ఒక్కసారిగా మంటలు చెలరేగి, మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తుకు వేగంగా వ్యాపించాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

షాపులో పెద్ద మొత్తంలో రసాయనాలతో కూడిన పెయింట్లు, ఇతర మండే స్వభావం కలిగిన సామగ్రి నిల్వ ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఫైరింజన్ల సహాయంతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, షాపులో అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించలేదనే ప్రాథమిక అనుమానాల నేపథ్యంలో అధికారులు దుకాణం నిర్వహణకు అవసరమైన అనుమతులపై ఆరా తీస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు