ఆత్మవిశ్వాసమా.. అతివిశ్వాసమా!
పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల ఫలితాల(Lok Sabha election results) తర్వాత దేశ రాజకీయాల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత గత రెండు పర్యాయాల లాగా ప్రభుత్వం బలంగా కనపడటం లేదు.. అలాగే మరోవైపు కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండీ కూ టమి బలం లోక్సభలో పెరగటం, రాహు ల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఎదగటంతో అనేక ప్రజా సమస్యలపైన ఉద్యమాలు, ఆందోళనలు జరగటంతో ప్రభుత్వం కొం త ఇరకాటంలో పడుతున్నది.
మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మొదటి ఐదు సంవత్సరాల పాలన సాఫీగానే సాగింది. రెండో పర్యాయం కూడా ఒక్క మూడు వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేసిన రైతు ఉద్యమం తప్ప ప్రభుత్వానికి పెద్దగా సవాళ్లు ఎదురుకాలేదు. కానీ, మూడో పర్యాయం ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏదో ఒక విషయంలో తరచూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన నిరసన గళాలు వినిపిస్తూనే ఉన్నాయి.
నీట్, ఇతర పరీక్ష పత్రాల లీకేజీ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెన్జీ ఉద్యమించటం.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం.. ఇప్పుడు ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఓటర్ జాబితా ప్రక్షాళన చేపట్టి కోట్లాది ఓట్లు తొలగించారని, దీనికి బాధ్యతగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కు మార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రధాన ప్రతిపక్షాలు, సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే, ఏఐఎస్ఏ ప్రెసిడెంట్ నేహా బోరా నేతృత్వంలో యువత, విద్యార్థులు ఉద్యమించటం మోదీ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టివేసింది.
ఇలాంటి సమయంలో ‘రాహుల్ గాంధీ, ఆయన మిత్ర పక్షాలకు ఒక విషయం చెప్పదలుచుకు న్నా. 2029లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో నాల్గోసారి కూడా ఓటమి చెందటానికి సిద్ధంగా ఉండండి’ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చాలెంజ్ విసిరారు. మునుపెన్నడూ లేని విధంగా మోదీ ప్రభు త్వం రాజకీయంగా బలమైన సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ తరుణంలో, సహజంగా ఏర్పడే ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతను తట్టుకొని అమిత్ షా చెప్పినట్లుగా బీజేపీ నాలుగోసారి కూడా ప్రతిపక్షాలకు ఓటమి రుచి చూపిస్తుందా?.. అనే అంశంపై రాజకీయ వర్గాలలో విస్తృతమైన చర్చ జరు గుతున్నది.
నాల్గోసారి గెలుపు సాధ్యమేనా?
భారతదేశ ఎన్నికల వ్యవస్థ ప్రారంభమైన తర్వాత 18 పర్యాయాలు లోక్ సభ ఎన్నికలు జరిగితే.. మొదటి మూడు 1952, 1957, 1962 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా నెహ్రూ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 1977 వరకు వరుసగా ఐదు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రె స్ గెలుపొందింది. కానీ, ఆరో లోక్ సభ ఎన్నికల నుంచి 15వ లోక్ సభ ఎన్నికల వరకు (1977 - 2014) ఏ ఒక్క పార్టీ దేశం లో వరుసగా మూడు పర్యాయాలు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించలేదు.
కానీ 16, 17, 18వ లోక్సభ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ వరుసగా మూడు పర్యాయాలు విజ యం సాధించి నెహ్రూ రికార్డును సమం చేసింది. 2029లో జరిగే 19వ లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచి రికార్డు సృష్టిస్తుందని, నాల్గోసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉండాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సవాల్ చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాల నుంచి బిజెపి అగ్రనాయకత్వం గట్టి గుణపాఠం నేర్చుకున్నట్లుగానే కనిపిస్తున్నది.
లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో 11 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగితే జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, కేరళం, తమిళనాడు లాంటి నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీకి ఓటమి ఎదురైంది. హర్యానా, మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ, అసోం, పశ్చిమ బెంగాల్ లాంటి బలమైన ఆరు రాష్ట్రాల్లో ఆ పార్టీ తిరుగులేని విజయాలను నమోదు చేసిం ది. ఉత్తర భారతంలోనే కాదు పశ్చిమ, తూర్పు (అంగ భంగ కలింగ) భారతాల్లో కూడా బీజేపీ ఒక బలమైన రాజకీయ శక్తిగా కనిపిస్తున్నది.
ఒక్క దక్షిణాదిలోనే ఆ పార్టీ కొంత బలహీనంగా కనిపిస్తున్నది. బీజేపీ తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తన బలాన్ని, అధికారాన్ని కాపాడుకోవడమే కాదు తాను అధికారంలో లేని బెంగాల్, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో కూడా అధికారాన్ని సాధించటంతో ఆ పార్టీ బలం మరింత పెరిగింది. కాబట్టే నాల్లోసారి కూడా అధికారాన్ని సాధిస్తామనే ధీమాను బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి తన ముందున్న అన్ని అవకాశా లను సమర్థవంతంగా, వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటున్నది. ఒక్క రాజకీయ వ్యూహాలే కాదు.. పాలనాపరమైన నిర్ణయాలతో కూడా దేశంలో బీజేపీ మ రింత బలపడుతున్నది. బీజేపీ మరోసారి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడానికి మహిళా బిల్లు, నియోజకవర్గాల పున ర్వ్యవస్థీకరణ (డీలిమిటేషన్) బిల్లు, సర్ ప్రక్రియ ద్వారా ఓటర్ల లిస్టు ప్రక్షాళన లాం టి వాటిని కూడా ఉపయోగించుకుంటుందనటంలో సందేహం లేదు.
బలం చాటున బలహీనత
18వ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఇండీ కూటమి అనూహ్యంగా తన బలాన్ని పెంచుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీతోపాటు ఇండీ కూటమి బలం సభలో దాదాపు 230గా ఉన్నది. పెరిగిన ఈ బలంతో ఇండీ కూటమి అనేక అంశాలపై, ప్రజా సమస్యలపై అటు లోక్ సభలోనూ ఇటు క్షేత్రస్థాయిలో బీజేపీ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టగలుగుతున్నది. ముఖ్యంగా ప్రశ్నాప త్రాల లీకేజీ వ్యవహారంలో ఇండీ కూటమి పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీసింది.
మహిళా బిల్లు సవరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును సభ ఆమోదం పొందకుండా చూడటంలో ఇండీ కూటమి పైచేయి సాధించింది. కానీ ఆ కూటమిలోని కీలక భాగస్వామ్య పక్షాలైన టీఎంసీ, డీఎంకే పార్టీలు బెంగాల్, తమిళనాడు శాసనసభ ఎన్నికలలో ఓడిపోవడం.. టీఎంసీలో చీలిక, ఎన్సీపీ (పవార్) పార్లమెంటరీ పార్టీలో చీలిక.. డీఎంకే, ఆప్ పార్టీలు ఇండీ కూటమికి దూరంగా ఉండటంతో పాటు కాంగ్రెస్ ఒక్క కేరళంలో తప్ప రాజకీయంగా మరెక్కడా బలపడకపోవడంతో బీజేపీ అప్రతిహత విజయా లను ఇండీ కూటమి అడ్డుకోలేక పోతున్నది.
ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ, ఇండీ కూటమి నేతలు చేస్తున్న పోరాటం ఒక్కటే వారిని రాజకీయంగా గెలుపు ముంగిట నిలబెట్టలేదు. ‘దేశ ప్రజల గొంతుక పొలాల్లో, పల్లెల్లో, అడవుల్లో, కొండల్లో, నదీ తీరాల్లో వినిపిస్తుంది. కానీ, ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఉనికి నామమాత్రం. దాదాపు లేనేలేదు. గ్రామాల్లో కాంగ్రెస్ ఎక్కడ?’ అని అమిత్ షా ప్రశ్నిస్తున్నారు. బలహీన కాంగ్రెస్ తమను ఓడించే అవకాశం లేదనే ధీమాని ఆయన వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్.. గేమ్ చేంజర్
2027 ప్రథమార్థంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ లాంటి కీలకమైన రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు బీజేపీకి, ఇండీ కూటమికి ప్రతిష్టాత్మకంగా మారబోతున్నాయి. 1985 నుంచి గుజరాత్లో కాంగ్రెస్కు గెలుపు దూరమైంది. పంజాబ్లో కాంగ్రెస్కు గెలుపు అవకాశాలు ఉన్నా అంతర్గత కుమ్ములాటలతో ఆ పార్టీ బలహీన పడిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ సమాజ్ వాది కూటమికి శాసనసభ ఎన్నికల్లో మూడోసారి కూడా ఓటమి ఎదురై తే.. భారతీయ జనతా పార్టీ నాల్గోసారి కూడా లోక్ సభ ఎన్నికల్లో అవలీలగా విజ యం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఇండీ కూటమి మెరుగైన ఫలితాలు సాధించగలిగితే 2029 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి చాలెంజ్ విసరగలుగుతుంది.
వ్యాసకర్త: అసిస్టెంట్ ప్రొఫెసర్, 9885465877