కాళోజీ ప్రజాస్వామిక విలువలు
కాళోజీ తన కవితలన్నింటిలో ప్రజాస్వామిక విలువల గురించి, ప్రజాస్వామిక వ్యవస్థ లక్షణాల గురించి రాశాడు. పౌరుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత ముఖ్యమైన వాడో చెప్పే ప్రయత్నం చేసాడు. కాళోజీ(Kaloji Narayana Rao)ని కలిసిన ప్రతి సందర్భంలోనూ ఆయన నోటి నుంచి అత్యున్నత మైన మానవ విలువల గురించే వినేవాళ్ళం. అది ఎంతో చిన్న సంఘటన కావ చ్చు, మామూలు దినచర్యకు సంబంధించి అంశం కావచ్చు. వాటిలో కూడా కాళోజీ ప్రతిసారీ ఒక మానవతా కోణాన్ని దర్శింపజేసేవాడు. ప్రజాస్వామ్యంలో పరిపాలనా వ్యవస్థ అత్యంత జవాబుదారీతనంతో ప్రవర్తించి, ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని విశ్వసించేవాడు. ఆయనతో నాకు అనేక జ్ఞాపకాలు ఉన్నాయి.
ఒకసారి - ఎమర్జెన్సీ ఎత్తివేసిన మొదటి రోజుల్లో మేము హన్మకొండలో అధిక ధరలకు నిరసనగా అన్ని పార్టీల సహకారంతో ఊరేగింపుగా కలెక్టర్ ఆఫీసుకు వెళ్ళాం. కాళోజీయే ఆ ఊరేగింపు ప్రదర్శనకు నాయకుడు. మేము కలెక్టర్ కార్యాలయం బయట గుమిగూడగానే, కలెక్టర్ క్యాంప్ క్లర్క్ వచ్చి, ‘కాళోజీ గారిని కలెక్టర్ గారు లోపలికి రమ్మంటున్నార’ని చెప్పాడు. వెం టనే కాళోజీ ‘నేను ప్రజలతో వచ్చాను, లోపలికి రాను, కలెక్టర్‌నే బయటకు రమ్మ ను’ అన్నాడు. అప్పటి కలెక్టర్ సమర్జిత్ రే గారు చాలా మంచివాడు కావడం వల్ల తానే బయటికి వచ్చి కాళోజీ అందజేసిన మెమోరాండం తీసుకున్నాడు.
‘నేను ప్రజలతో వచ్చాను. నువ్వు పిలిచావని నేనొక్క డినే లోపలికి వస్తే, ప్రజలు కాళోజీగాడు లోపలికి పోయి చాయ్ తాగి, కలెక్టర్‌తో బాతాఖానీ చేసి వచ్చాడు అంటారు. అం దుకే నిన్ను ప్రజల ముందుకు పిలిచాను, వీరి సమస్యలను ప్రభుత్వానికి తెలుపు’ అని చెప్తూ, నువ్వు ప్రజాసేవకుడివి, అధికారివి కావు, ప్రజల పట్ల బాధ్యత కనబర చాలి అన్నాడు. ఈ సంఘటనలో కొందరికి కాళోజీ ‘తలతిక్క వ్యక్తిగా’ కనిపిస్తే మరికొందరికి ‘నాయకుడిగా’ కనపడ్డాడు. నిజానికి కాళోజీ ప్రభుత్వ అధికారులకు ప్రజల పట్ల ఉండాల్సిన గౌరవం, జవాబుదారీతనం అనే విలువల గురించి చెప్పే ప్రయత్నం అనునిత్యం చేస్తుంటాడు.
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నవాడుగా ప్రభుత్వం ఆయనకు తామ్రపత్రం ఇవ్వదలచినప్పుడు కూడా ఆఫీసుకు వెళ్ళి తీసుకోవడానికి నిరాకరించాడు. ‘ప్రజలు, ప్రజలతో పాటు మేము ఉద్యమం చేయ డం వల్ల స్వాతంత్య్రం వచ్చింది. ఆ స్వతంత్ర దేశంలో నువ్వు అధికారివైనావు. మా ఇంటికి వచ్చి నాకు తామ్రపత్రం అందజేయడం నీ బాధ్యత’ అన్నాడు. అప్పుడు కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారితో ఆ తామ్రపత్రాన్ని కాళోజీ ఇంటికి పంపాడు.
ఇట్లా కాళోజీ ప్రతిచర్యలో మనకు ఒక విలువ, ఒక మానవతా కోణం గోచరిస్తుంది. ప్రజాస్వామిక విలువల గురించే కాదు, ప్రజాస్వామ్యాన్ని ఆరోగ్యకరంగా కాపాడుకోవడంలో పౌరుల బాధ్యత, పాత్ర గురించి కూడా కాళోజీ తన కవితల్లో నొక్కి చెప్తాడు.ప్రజాస్వామ్యంలో పౌరుడెప్పుడూ కళ్ళు తెరుచుకొని ఉండాలి అనే విషయాన్ని పదేపదే చెప్తాడు. పౌరులు ఎంత శక్తివంతులనే విషయాన్ని ఖమ్మంలోని శీలం సిద్ధారెడ్డి కాలేజీ విద్యార్థి సంఘం సమావేశంలో చాలా వివరంగా చెప్పాడు.
నేను కాళోజీతో అప్పుడు ఖమ్మం వెళ్ళడం జరిగింది.ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను ‘ఓట్లకు పుట్టిన కొడుకులు’ అని వర్ణిస్తూ, ‘ప్రజలు ఓట్లు వేయడం వల్ల ఒక ఎమ్. ఎల్.ఏ, ఒక ఎం.పి. ఎన్నిక అయ్యారంటే దాని అర్థం ప్రజలు తమకుండే శక్తిలోంచి కొంచెం దానం చేసి వాడికి ఇవ్వడం వల్ల వాడికి అధికారం వచ్చింది. అంటే వాడి అధికారం ప్రజల నుంచి వచ్చిందే. అం దుకే ప్రజలకు వాణ్ణి గల్లా పట్టి అడిగే హక్కు ఉంది’ అన్నాడు. అందుకే ప్రజలు తమను తాము ఎప్పుడూ అశక్తులమని అనుకోకూడదు అని అంటాడు. ప్రజాస్వా మ్య వ్యవస్థపై అచంచలమైన నమ్మకాన్ని ప్రకటిస్తాడు. అంతే కాకుండా మానవీయ విలువలతో కూడిన పాలనా సంబంధాలను తన కవితల్లో స్ఫురింపచేస్తాడు. ‘ప్రజాస్వామ్యమంటే’ అనే కవితలో...
‘ప్రజాస్వామ్యమంటేమిటి?
ప్రజారాజ్యమంటేమిటి?
సౌజన్యాలకు రక్ష- రక్ష
సహకారాలకు రక్ష సహజీవనానికి రక్ష
ప్రజాస్వామ్యమంటే అది
ప్రజారాజ్యమంటే అది!
మానవత్వానికి మనుగడ -
దానవత్వానికి ఎద దడ
గుండాతనానికి దగడు
గూడుపుఠాణికి బెగడు!
కుట్రదారులకు హడలు -
చట్రాలను మాడ్చుకొడలు
శాసనబద్ధ వ్యవస్థ -
స్వైరవిహారున కవస్థ!
ముఠాబందికి మృత్యువు
-శఠపీఠముల శత్రువు!
ఆకతాయి సంహరణ -
అనామకుని సంరక్షణ!
హక్కుల కాపాడు కోట -
మక్కువ వికసించుతోట!
నెయ్యము పెంచెడి మడి -
నీతుల నేర్పెడి బడి
ఆర్ద్రత ఆరని తడి
అమ్మకడుపు దాచిన బడి’ అంటాడు.
‘పైన పేర్కొన్న అంశాలన్నీ ఆచరించబడితేనే ఆ ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజా స్వామిక విలువలు ఉన్నట్టు, లేకుంటే అది ఒక అనారోగ్యకరమైన వ్యవస్థ. అట్లా ఉం డటానికి కారణం నాయకుడిది కాదు, పౌరుడిదే’ అని పౌరుడిపై భారం పెడతా డు. అలాగే ‘రాజకీయ పార్టీలు ప్రజాస్వా మ్యవ్యవస్థలో అత్యంత కీలకమైన సం స్థలు. అవి సమాజం పట్ల తమ అవగాహ న మేరకు, కొంత వరకు ప్రజల ఆకాంక్షల మేరకు తమ కార్యక్రమాల్ని రూపొందించుకుంటాయి.
ఆ అవగాహనకు తగ్గట్టు కొన్ని నినాదాలను ప్రజల ముందు పెడ్తా యి. సమాజ గమనాన్ని బట్టి ఎప్పటికప్పు డు తమను తాము కొంత దిద్దుకుంటా యి కూడా. ఈ క్రమంలోనే ప్రజల అభిమానాన్ని చూరగొని అధికారంలోకి వచ్చి పాలనా బాధ్యతలు చేపడతాయి. రాజకీయ పార్టీలు లేకుండా ప్రజాస్వామిక వ్యవస్థ మనలేదు. అందుకే రాజకీయ పార్టీలు విలువల పునాదిపై నడుచుకోవాలి అని కాళోజీ గాఢంగా విశ్వసించాడు. రాజకీయాలు నిర్మాణాత్మకంగా, క్రియాశీలంగా ఉండాలని చెప్తూ ‘ప్రజాకీయాలు’ అనే ఒక కొత్త పదప్రయోగం చేశాడు. ‘ప్రజాకీయాలు’ అన్న కవితలో రాజకీయాలు ఎట్లా విలువల రాహిత్యంతో భ్రష్టుపట్టి పోయాయో వివరిస్తూ,
‘ప్రజాకీయాలీనాటికీ
ప్రయోగ దశకు రాలేదు.
రాజకీయా లే కొరివి దయ్యాలై -
కులుకుతున్నాయి’ అంటాడు.
ఇటువంటి పరిస్థితిలో ప్రజలు పూనుకోకపోతే రాజకీయాలు ప్రజాకీయాలుగా పరిణామం చెందవు అంటాడు. ప్రజలు ఉద్యమించకుండా రాజకీయాల్లో ప్రజాస్వామిక సంస్కృతి నెలకొనదు అంటూ మళ్ళీ ఈ పరిస్థితికి ప్రజలే కార ణం అంటాడు. ‘ప్రజలు ప్రజలు’ అనే కవితలో
‘ప్రజలు ప్రజలు మేటి ప్రజలు!
ప్రజాస్వామ్యమందు ప్రజలు
మౌనంగా ఉన్నారేం?
మరణాంతర స్థితి మాదిరి
ప్రజాస్వామ్య జీవనది
పట్టు తప్పలేదు కదా?
అనవరతము జాగరణము
అనివార్యము ప్రజలకను
ప్రజాస్వామ్య మూల మంత్ర పాఠమేల మరిచెను ప్రజ? అంటాడు. పౌరుణ్ణి సం ధిస్తూ రాసిన అన్ని కవితల్లోనూ పౌరులకు ఉండాల్సిన విలువలు, ప్రజాస్వామ్య రక్షణలో వారి బాధ్యత గురించి ఉంటుంది. కాళోజీ చెప్పిన అన్ని కవితల్లోనూ దండలో దారంలా మానవీయ విలువలు, ప్రజాస్వామిక ఆకాంక్ష మనకు గోచరిస్తుంది. ప్రభుత్వాల వైఫల్యాలు, విలువల రాహి త్యం గురించి వ్యంగ్యంగా చెప్తాడు.
చాపచింపు దొరికితే సామ్రాజ్యం దొరికినంతగా, కోడిగుడ్డును సాధించటం కోహినూరు వజ్రాన్ని సాధించటమంతగా పరిస్థితులు దిగజారటానికి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే కారణం అని కటువుగా ప్రకటిస్తాడు. కాళోజీ కవిత్వం నిండా ఒక సిద్ధాంతం, ఒక ప్రగాఢమైన విశ్వాసం, అత్యున్నతమైన ప్రజాస్వామిక, మానవతా విలువ ల కోసం ఆతురత కనపడుతుంది. ఇటువంటి ఒక విలువల కవి, ప్రజల కవి మాన వ చరిత్ర ఉన్నంత కాలం జీవించే ఉంటా డు, ఆయన భావాలను అన్ని తరా లు ఎప్పుడూ చర్చించుకుంటూనే ఉంటాయి.
ఎస్ జీవన్‌కుమార్
(‘సజీవ స్మృతులు’ పుస్తకం నుంచి)