దొరల రాజకీయానికి చరమగీతం పాడుదాం

13-11-2026 | 05:10am

మోత్కూరు మీటింగ్‌లో టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(TRP President Teenmar Mallanna) చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర 50వ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం మోత్కూర్‌కు చేరుకున్నది. మోత్కూరులో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో తీన్మార్ మల్లన్న ప్రసంగించారు. దశాబ్దాలుగా సాగుతున్న దొరల, రెడ్ల పెత్తనానికి చరమగీతం పాడేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఏకమవుతున్నారని ప్రకటించారు.

‘తుంగతుర్తి నియోజకవర్గంలో మొత్తం 2,35,349 ఓట్లు ఉన్నాయి. ఇందులో ఒక్క బీసీల ఓట్లే లక్షా 60 వేలు, రెడ్ల ఓట్లు కేవలం 17,604 ఓట్లు మాత్రమే ఉండగా 17 వేల ఓట్లు కూడా లేని రెడ్డోడు మునుగోడు నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో నేను నిర్ణయిస్తా అని చెప్తున్నాడు. పిడికెడు ఓట్లు లేని దొరలు బీసీలను శాసించడం ఇక చెల్లదు. వచ్చే ఏడాదికి తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం జనరల్ స్థానం కాబోతోంది.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున గడ్డం నరసింహను తుంగతుర్తి ఇన్‌చార్జ్జీగా ప్రకటిస్తున్నా.. ఇక్కడి నుంచి బీసీల పోరాటం ఏందో చూపిస్తాం’ అని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ నాయకుడు అశోక్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల ని కోరారు. సభలో టీజీఎస్సార్టీసీ బస్సు డిపో సాధన కమిటీ ప్రతినిధులు అందించిన వినతిపత్రంపై మల్లన్న సానుకూలంగా స్పందిస్తూ, మోత్కూరు ప్రాంతీయ అభివృద్ధి కోసం చట్ట సభలో మాట్లాడుతానని అన్నారు.

బస్సు డిపో, కళాశాల, ఆసుపత్రి, రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించడాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిట్టల శంకర్, జిల్లా అధ్యక్షులు కొమిరిశెట్టి నరసింహులు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్యగౌడ్, వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శులు ప్రసన్న, జాతీయ వ్యవహారాల ఇంచార్జి పూజిత,జిల్లా మహిళా అధ్యక్షురాలు సునీత,స్టేట్ ఆఫీస్ కో లింగం యాదవ్, జిల్లా ఉపాధ్యక్షురాలు ఉష, పిట్టల సుశీల పాల్గొన్నా రు. ఎన్.మహేష్‌ను రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు.

మరిన్ని వార్తలు