గ్లోబల్ సెంటర్లే గల్లాపెట్టెలు!

13-11-2026 | 05:15am
  1. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చోదకశక్తులుగా జీసీసీలు
  2. టెక్నాలజీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం
  3. ఇతర పరిశ్రమలతో ఐటీ రంగం అనుకూలతల అనుసంధానం
  4. మార్స్ జీసీసీ ప్రారంభోత్సవంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): తెలంగాణ ఆర్థిక ప్రగతికి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)ను కీలక చోదక శక్తులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(IT Minister Sridhar Babu) పేర్కొన్నారు. కొత్త టెక్నాలజీ అభివృద్ధి, ఆర్ అండ్ డీ, డేటా అనలిటి క్స్, ప్రొడక్ట్ డిజైన్, ఇంజినీరింగ్, ఇన్నోవేషన్ తదితర విభాగాల్లోనూ కీలక పాత్ర పోషించేలా వాటికి మార్గనిర్దేశం చేస్తున్నామన్నారు.

స్నికర్స్, పెడిగ్రీ, రాయల్ కానిన్ తదితర ప్రముఖ బ్రాండ్లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మార్స్ సంస్థ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన జీసీసీని ఆయన గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ... హైదరాబాద్‌ను సంప్రదాయ ఐటీ సేవల కేంద్రం నుంచి ప్రపంచస్థాయి టెక్నాలజీ, ఇన్నోవేషన్, నాలెడ్జ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు.

కొత్త రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు, ఉద్యోగ అవకాశాలను పెంపొందించేందుకు ఐటీ/ఐటీఈఎస్ రంగంలో హైదరాబాద్‌కు ఉన్న అనుకూలతలను ఇతర పరిశ్రమలతో అనుసంధానించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని పేర్కొన్నారు. ఈ లక్ష్యాలకు అనుగుణంగానే ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌లోనూ టెక్నాలజీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు.

జెన్‌పాక్ట్ సహకారంతో ఏర్పాటైన ఈ కేంద్రంలో ప్రస్తుతం 400 మందికి పైగా ఉపాధి లభించనుందని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య వేయికి పెరుగుతుందని చెప్పారు. మార్స్ గ్లోబల్ ఆపరేషన్స్‌కు అవసరమైన డిజిటల్, డేటా, ఏఐ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. కార్యక్రమంలో మార్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ క్లాస్ ఆగార్డ్, జెన్‌పాక్ట్ ప్రతినిధి తరుణ్ చోప్రా, అమెరికా కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ ప్రతినిధి ఎమీలియా బీ. స్మిత్ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు