శిశు మందిర్‌పై నిర్లక్ష్యమెందుకు?
- చదువుతో పాటు క్రమశిక్షణ, దేశభక్తి నేర్పే విద్యాలయాలు
- కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, నవంబరు 12 (విజయక్రాంతి): కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా విద్యను అందిస్తున్న సరస్వతి శిశు మందిర్ విద్యాలయా ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని అవలంభిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) విమర్శించారు. దేశంలో ఎంతో మంది పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి ఉన్నతికి తోడ్పాటు అందిస్తున్న సరస్వతి శిశు మందిర్ల పట్ల పాలకులు రాజకీయ ధోరణితో వ్యవహరించడం దుర్మార్గమని పేర్కొన్నారు.
కరీంనగర్లో శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇం గ్లీష్ మీడియం హైస్కూల్లో గురువారం విభాగ్ స్థాయి సమావేశాలు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశాలకు దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి లింగం సుధాకర్‌రెడ్డి పాల్గొని మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో విద్యతో పాటు సంస్కారం, క్రమశిక్షణ, దేశభక్తి వంటి సద్గుణాలను పెంపొందించడంలో శిశు మందిర్ విద్యావిధానం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
శిశు మందిర్ లో విద్యను అభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. సరస్వతి శిశు మందిర్ విద్యాలయాలు దేశభక్తి, క్రమశిక్షణ, నైతిక విలువలకు పట్టుగొమ్మలని కొనియాడారు. ఈ విద్యాలయా ల పట్ల రాష్ట్ర పాలకులు చిన్న చూపు చూడడం సహించరానిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముక్కాల సీతారాములు, పాక సత్యనారాయణ, నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, ఇంజనీర్ కోల అన్నారెడ్డి, తేళ్ల రాజమౌళి, ప్రధానోపాధ్యాయులు మోర రణదీర్, ఎలగందుల సత్యనారా యణ, బండారి కరుణాకర్, సాంబ శివరావు, కాటం రవీందర్ పాల్గొన్నారు.