కరువు కాలంలో పార్టీల పటాటోపం!
దేశంలోని పలు ప్రాంతాలతో పాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కూడా వర్షాభావ పరిస్థితులు(Rainy Conditions), తీవ్రమవుతున్న వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ఒత్తిడి పెరుగుతున్నది. ఈ తరుణంలో ఒక ఆచరణాత్మకమైన ప్రశ్న ముందుకొస్తోంది. గ్రామీణ ప్రాంతాలు నీరు, ఉపాధి, సహాయక చర్యల కోసం అల్లాడుతుంటే.. రాజకీయ పార్టీలు(Political Parties) మాత్రం భారీ బహిరంగ సభలు, పాదయాత్రలు, బలప్రదర్శన సమావే శాలను నిర్వహించడం ఎంతవరకు సమంజసం.
అసలు ఇలాంటి ఆర్భాట సభలు అవసరమా? ఇలాంటి కార్యక్రమాలకు హాజరయ్యే వారికి చెల్లింపులు, రవాణా, వేదికల నిర్మాణం, ఇతర ఏర్పాట్లు, నిర్వహణ ఖర్చులు కలిపి కనీసం రూ.2 కోట్లకు పైగానే వ్యయమవుతోంది. చాలా సందర్భాల్లో ఈ మొత్తం ఇంకా ఎక్కువగా ఉంటోంది. అంతిమంగా ప్రజలే ఈ భారాన్ని భరించాల్సి వస్తోంది. ప్రజా సమస్యలపై దృష్టి మళ్లడం, విలువైన అవకాశాలు కోల్పోవడం, ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిలో ఉన్న ప్రభు త్వ వనరులపై అదనపు భారం పడటం లాంటి రూపాల్లో ఈ వ్యయం ప్రజలపై ప్రభావం చూపుతోంది.
ఇంకా.. రెండేళ్ల సమయం ఉంది..
తదుపరి ప్రధాన ఎన్నికల ఘట్టానికి ఇంకా దాదాపు రెండేళ్ల సమయం ఉన్నందున, రాజకీయ పార్టీలు సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే ఏడాది పాటు అన్ని రాజకీయ పార్టీలు భారీ బహిరంగ సభలు, పెద్ద ఎత్తున జనసమీకరణతో నిర్వహించే సమావేశాలకు తాత్కాలికంగా విరామం ఇస్తే, పరిపాలనా యంత్రాంగం తన శక్తిని, ప్రజల దృష్టిని మరింత అత్యవసరమైన సమస్యల పరిష్కారంపై కేంద్రీకరించేందుకు అవకాశం ఉంటుంది. తమ విధానాలను ప్రజలకు వివరించడానికి, ప్రత్యర్థుల విమర్శలకు సమాధానం చెప్పడానికి ఇప్పటికే డిజిటల్ వేదికలు, ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికలు వంటి అనేక మార్గాలు రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉన్నాయి.
పంట పొలాలు ఎండిపోతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో భారీ మైదానాల్లో జనసమీకరణ, డబ్బు లిచ్చి జనాన్ని తరలించడం, భారీ వేదికలతో ఆర్భాటం చేయ డం ద్వారా తమ సంస్థాగత బలాన్ని చాటుకోవాలని పట్టుదలగా వెళ్లడం కష్టతరంగా మారుతోంది. ఈ వ్యయాల లెక్కలు సుస్పష్టంగానే ఉన్నాయి. సభలకు జనాన్ని తరలించేందుకు ఒక్కొక్కరికి సుమారు రూ.1,000 చొప్పున చెల్లిస్తున్నారన్న వార్తలు, వాహనాల సమీకరణ, తాత్కాలిక మౌలిక సదుపాయాల ఏర్పాటు, భద్రతా ఏర్పా ట్లు తదితర ఖర్చులు కలిపితే ఒక్క భారీ సభకే కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి.
ఇదే తరహాలో వివిధ పార్టీలు నెలల తరబడి నిర్వహించే కార్యక్రమాలన్నింటినీ కలిపి చూస్తే, మొత్తం వ్యయం గణనీయమైన స్థాయికి చేరుతుంది. వ్యవసాయం, చిన్న వ్యాపారాలు లేదా రోజువారీ కూలి పనులపై ఆధారపడిన వారు సభలకు హాజరయ్యేందుకు తమ విలువైన పనిదినాలను కోల్పోతున్నారు. ప్రతి వనరునూ కరువు నివారణ, నీటి సంరక్షణ, ఉపాధి కల్పన, నిర్దేశిత సహాయక చర్యలకు వినియోగించాల్సిన కీలక సమయంలో, ఈ పరిణామం విస్తృత ఆర్థిక వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది.
సాయినాథ్ మాటల్లో..
ఈ పరిస్థితి ప్రముఖ పాత్రికేయులు పీ సాయినాథ్ తన ‘అందరూ మంచి కరువునే కోరుకుంటారు’ (ఎవ్రీబడీ లవ్స్ ఏ గుడ్ డ్రాట్) అనే పుస్తకంలో ప్రస్తావించిన లోతైన విమర్శను గుర్తుచేస్తోంది. ఈ పుస్తక శీర్షికకు ఆధారమైన మాటలు పాలములోని ఓ రైతు కార్యకర్తతో జరిగిన సంభాషణలోనివి. ఆ రైతు కార్యకర్త మాటల్లోనే చెప్పాలంటే.. ‘.. ఇక్కడ పెద్ద కరువు పరిస్థితులు నెలకొన్నా యి. సమాజంలోని పెద్ద మనుషులు దీని ద్వారా చాలా డబ్బు సంపాదిస్తున్నారు... సహాయక చర్యల రూపంలో వచ్చే డబ్బు, అధికారవంతులను గతంలో కంటే మరింత ధనవంతులుగా మారుస్తోంది. ఇది నిజంగా మంచి వ్యాపారం. ఇక్కడ మాకు మంచి కరువే కావాలి..’
కరువు, గ్రామీణ ప్రజల కష్టాలు కూడా ఒక పరిశ్రమగా ఎలా రూపాంతరం చెందుతున్నాయో సాయినాథ్ తన రచనలో వివ రించారు. కాంట్రాక్టులు, ప్రచారం, మధ్యవర్తుల లాభాలకు ఇవి అవకాశాలను సృష్టి స్తుండగా, అసలైన కష్టాలను మాత్రం పేద ప్రజలే భరిస్తున్నారు. రాజకీయ ఆర్భాటాలు కూడా ఇదే తరహాలో మరో రూపంలో కొనసాగుతున్నాయి.
విస్తృత ప్రచారం పొందే కార్యక్రమాలు, భారీ జనసమీకరణలు, రాజకీయ నెటవర్క్‌లను బలోపేతం చేయడం, అనేక కార్యకలాపాలకు ఊతమివ్వడం జరుగుతున్నప్పటికీ.. నీటి కొరత, అప్పుల భారం, జీవనోపాధి భద్రత వంటి మౌలిక సమస్యలపై నిరంతర దృష్టి మాత్రం కొరవడు తోంది. పేదరికాన్ని కేవలం అప్పుడప్పుడు చోటుచేసుకునే విషాద ఘటనగా మాత్రమే చూడకూడదని కూడా సాయినాథ్ హెచ్చరించారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే.. ‘చాలా సందర్భాల్లో పేదరికం, లేమి పరిస్థితులను కొన్ని సంఘటనలుగానే వార్తల్లో చూపిస్తున్నారు.
అంటే ఏదైనా విపత్తు సంభవించినప్పుడు, ప్రజలు మరణించినప్పుడు మాత్రమే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయినప్పటికీ, పేదరికం అంటే కేవలం ఆకలితో మరణించడం లేదా దాదాపు కరువు పరిస్థితులు నెలకొనడం మాత్రమే కాదు. అనేక అంశాల సమాహారమే పేదరికం... భూమి, ఆరోగ్యం, విద్య, అక్షరాస్యత, శిశు మరణాల రేటు, ఆయుర్దాయం... అప్పులు, ఆస్తులు, సాగునీరు, తాగునీరు, పారిశుద్ధ్యం, ఉపాధి వంటి అంశాలు కూడా అంతే ముఖ్యమైనవి’.
భారీ బహిరంగ సభలు కూడా ఇలాంటి సంఘటనల ఆధారిత రాజకీయ నాటకాల కు మరో రూపంగా మారే ప్రమాదం ఉంది. హడావుడి, ఫొటోలకు ఆకర్షణీయమైన దృశ్యాలు, తాత్కాలిక హంగులతో సాగిపో యే ఈ కార్యక్రమాల మధ్య గ్రామీణ ప్రజల కష్టాలు మాత్రం తెరవెనుకే ఉండిపోతున్నాయి.
ప్రభుత్వాల ప్రాధాన్యత..
ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో తీవ్ర ఎండలు, పంట నష్టాలతో సహాయక ప్యాకేజీల కోసం డిమాండ్ చేసేస్థాయికి దారితీశాయి. పలు రాష్ట్రాల్లో రైతులకు ఉపశమనం కల్పించే చర్యలు, పెట్టుబడి రాయితీలు, విస్తృత స్థాయిలో ఆర్థిక సహాయం అందించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో ప్రభుత్వాలు ఇతర ఆర్థిక బాధ్యతలను కూడా నిర్వ ర్తించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పదేపదే కోట్ల రూపాయల వ్యయంతో రాజకీయ సభలు నిర్వహించడం వల్ల కలిగే అవ కాశ వ్యయం స్పష్టంగా కనిపిస్తోంది. అదే సంస్థాగత సామర్థ్యాన్ని, ప్రజల దృష్టిని మరింత శాశ్వత ప్రయోజనాలను అందించే కార్యక్రమాల వైపు మళ్లించవచ్చు. భూగర్భ జలాల పునరుద్ధరణ, నీటి సమర్థ వినియో గం, సకాలంలో ఉపాధి పథకాల అమలు, సహాయక చర్యలను పారదర్శకంగా ప్రజలకు చేరవేయడం వంటి అంశాలకు ప్రాధా న్యత ఇవ్వవచ్చు.
ప్రజలే మూల్యం చెల్లించాల్సి వస్తోంది..
సంక్షోభాలు ఎప్పుడూ పూర్తిగా ప్రకృతి వైపరీత్యాల వల్ల మాత్రమే సంభవించవని సాయినాథ్ రచనలు మనకు గుర్తుచేస్తున్నాయి. వాటి తీవ్రతను ప్రోత్సాహకాలు, ప్రాధాన్యతలు, వనరులు మరియు అధికారాన్ని నియంత్రించే వ్యక్తులు తీసుకునే నిర్ణయాలు కూడా ప్రభావితం చేస్తాయి. గ్రామీణ ప్రాంతాల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపడంకంటే రాజకీయ కార్యక లాపాలు ఆర్భాట ప్రదర్శనల వైపు ఎక్కువగా మళ్లినప్పుడు, ప్రజలు రెండుసార్లు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.
ఒకసారి అసలు సంక్షోభం వల్ల ఎదురయ్యే కష్టాల రూపంలో.. మరోసారి ఆ సంక్షోభం మధ్య జరిగే ఆర్భాట ప్రదర్శనల ఖర్చుల రూపంలో ప్రజలే మూల్యం చెల్లించాల్సి వస్తోంది. భారీ బహిరంగ సభల నిర్వహణకు ఏడాది పాటు సంయమనం పాటిం చడం అనేది చిన్నదైనా.. కష్టకాలంలో తీసుకోదగిన ఆచరణాత్మకమైన మార్పు. ప్రజల అవసరాలే ప్రథమ ప్రాధాన్యత కావాలన్న విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తించాల్సిన సమయం ఇదే.
పొంతనలేని దృశ్యాలు..
భారీ బహిరంగ సభలను సమర్థించేవారు ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రత్యక్ష సమీకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, ముఖాముఖి రాజకీయాలకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుందని, డిజిటల్ ప్రచారం జనసమూహంలో కనిపించే ఉత్సాహానికి పూర్తిస్థాయిలో ప్రత్యామ్నాయం కాలేదని వాదించవచ్చు. ఈ వాదనల్లో కొంత వాస్త వం లేకపోలేదు.
అయితే సభల పరిమాణం, తరచుగా నిర్వహించడం, వాటి వెనుక ఉన్న పరిస్థితులు కూడా అంతే ముఖ్యమైనవి. నగదు లేదా రవాణా సౌకర్యాలు కల్పించి జనాన్ని తరలించడం, భారీ వేదికలు, ఇతర ఏర్పాట్లను పోటాపోటీగా ప్రదర్శించడం సాధారణంగా మారినప్పుడు.. నిజమైన రాజకీయ వ్యక్తీకరణకు, ఖరీదైన ఆర్భాట ప్రదర్శనకు మధ్య ఉన్న తేడా క్రమంగా చెరిగిపోతోంది. కరువు సంవత్సరంలో ఈ వ్యత్యాసం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు కష్టాల్లో ఉన్న రైతులు, ఎండిపోతున్న పంట పొలాల దృశ్యాలు కనిపిస్తుంటే.. మరోవైపు కిక్కిరిసిన సభా ప్రాంగణాలు, ఖరీదైన ఏర్పాట్లతో కూడిన కార్యక్రమాల చిత్రాలు ఏమాత్రం పొంతనలేని విధంగా ఉంటున్నాయి.
భారీ బహిరంగ సభల నిర్వహణపై నిర్దిష్ట కాలపరిమితితో విరామం ప్రకటించడం వల్ల రాజకీయ ప్రసంగాలకు, భావ వ్యక్తీకరణకు అడ్డుకట్ట పడినట్లు కాదు. రాజకీయ పార్టీలు టెలివిజన్, సామాజిక మాధ్యమాలు, పత్రికలు, చిన్నస్థాయి స్థానిక సమావేశాల ద్వారా తమ అభిప్రాయాలను ప్రజలకు చేరవేయవచ్చు. అయితే వనరుల కొరత అందరినీ వేధిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, అందరి ప్రాధాన్యతలు కూడా ప్రజా అవసరాలకు అనుగుణంగా ఉండాలనే సందేశాన్ని ఈ నిర్ణయం చాటుతుంది. రాజకీయ శక్తిని, ప్రజా వనరులను బలప్రదర్శనల పోటీకి కాకుండా.. నీటి భద్రత, జీవనోపాధికి భరోసా, ఆర్థిక క్రమశిక్షణ వంటి తక్షణ అవసరాలకు అనుగుణంగా వినియోగించడం ఎంతో సముచితం.
సి.ఎల్. రాజం