గులాబీ గప్‌చుప్

13-11-2026 | 05:40am

ఎమ్మెల్సీ అభ్యర్థుల గుట్టు వీడేదెప్పుడు?

వరంగల్‌కు రాకేశ్‌రెడ్డి, హైదరాబాద్‌కు కాసాని? 

ప్రకటనకు బ్రేక్ ఎందుకో?.. వ్యూహమా? అసంతృప్తి భయమా?

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లో(Telangana Politics) మరో కీలక సమరానికి తెరలేచింది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న మహబూబ్‌నగర్- వరంగల్- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి ఇప్పటికే రాజుకుంది. మొత్తం 77 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ రెండు స్థానాలను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి క్షేత్రస్థాయిలో దూకుడు పెంచగా, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌(BRS)లో మాత్రం అభ్యర్థుల ప్రకటనపై ఇంకా సస్పెన్స్ వీడలేదు.

పట్టభద్రుల స్థానాలపై పట్టు నిలుపుకోవాలని భావిస్తున్న గులాబీ దళపతి కేసీఆర్, అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్- స్థానం నుంచి కాసాని వీరేశ్ ముదిరాజ్, వరంగల్-  నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి పేర్లను పార్టీ అధిష్ఠానం దాదాపు ఖరారు చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచా రం జరుగుతోంది. అయితే పేర్లు ఖరారైనా అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన వెలువడకపోవడం చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థుల ప్రకటనలో జాప్యం వెనుక అధిష్ఠానం వ్యూహమా? లేక ఆశావహుల మధ్య పోటీ, సామాజిక సమీకరణాల చిక్కులతో నిర్ణయం కొలిక్కి రావడం లేదా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.  

అభ్యర్థుల ఎంపికలో లెక్కలు..

రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ప్రత్యేక రాజకీయ ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులు, ఉద్యోగులు, యువత, విద్యావంతులు, పట్టణ ప్రాంత ఓటర్ల అభిప్రాయాలను ప్రతిబింబించే ఎన్నికలుగా వీటిని రాజకీయ పార్టీలు పరిగణి స్తాయి. సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల స్వభావం, స్థానిక సమస్యలు, అభ్యర్థుల వ్యక్తిగత పరిచయాలు, పట్టభద్రులతో ఉన్న అను బంధం ఇక్కడ కీలక పాత్ర పోషిస్తాయి. 

అందుకే అభ్యర్థుల ఎంపిక విషయంలో బీఆర్‌ఎస్  నాయకత్వం అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్ ఖమ్మం నల్లగొండ స్థానానికి ఏనుగుల రాకేష్‌రెడ్డి, హైదరాబాద్ నుంచి కాసాని వీరేష్, గెల్లు శ్రీనివాస్, నాగేందర్ గౌడ్, ఏ.వెంకటేశ్వర్‌రెడ్డి రేసులో ఉన్నారు.

అయితే రెండు నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానం ఒక అవగాహనకు వచ్చిందని, పేర్లు కూడా ఖరారు చేసిందని ప్రచారం జరుగుతోంది. అయితే అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన రాకపోవడంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే ఒకేసారి రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని నాయకత్వం భావిస్తోందా? ముందుగా ఒక స్థానానికి పేరు ప్రకటించి, రెండో స్థానంలో అసంతృప్తికి అవకాశం ఇవ్వకూడదనే జాగ్రత్త తీసుకుంటోం దా? లేక అభ్యర్థుల ఎంపికపై చివరి నిమిషంలో మార్పులకు అవకాశం ఉంచుతోం దా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

ప్రత్యర్థి పార్టీల దూకుడు..

ఒకవైపు కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించి ఎన్నికల కార్యాచరణను ప్రారంభించాయి. అభ్యర్థులు పట్టభద్రులను కలవడం, నియోజకవర్గాల పరిధిలో పర్యటించడం, వివిధ సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలతో జోరు పెంచాయి. ఇలాంటి సమయంలో బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటనలో జాప్యం జరగడం సహజంగానే చర్చకు దారితీస్తోంది. అభ్యర్థి ముందుగానే రంగంలోకి దిగితే ఓటర్లను వ్యక్తిగతంగా కలిసేందుకు, పట్టభద్రుల సమస్యలను తెలుసు కునేందుకు, స్థానిక స్థాయిలో బృందాలను ఏర్పాటు చేసుకునేందుకు సమయం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రెండు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ప్రచార నిర్వహణకు ఎక్కువ సమయం అవసరం.

ఈ నేపథ్యంలో ప్రకటన ఆలస్యమైతే ప్రచార ప్రణాళికను అమలు చేయడానికి లభించే వ్యవధి తగ్గే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలు కూడా కీలకంగా మారినట్లు తెలుస్తోంది. రెండు స్థానాల్లో ఒకటి బీసీలకు, మరొకటి ఇతర సామాజిక వర్గానికి కేటాయించాలనే ఆలోచనపై పార్టీ వర్గాల్లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్- నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలనే ఆలోచన తెరపైకి వచ్చినట్టు సమాచారం. వరంగల్ స్థానంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన రాకేష్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం కీలకంగా మారింది.  

ఓటరు నమోదుపైనా దృష్టి..

అభ్యర్థుల ఎంపికతో పాటు ఓటర్ల నమో దు కూడా అత్యంత కీలకమైన అంశంగా మారింది. రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు కొత్తగా ఓటర్ల జాబితాలను రూపొందిస్తున్నారు. గతంలో పట్టభద్రుల ఓటర్లుగా నమోదైన వారు సైతం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉండటంతో రాజకీయ పార్టీలు ఈ ప్రక్రియపై దృష్టి సారించాయి. అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలంటూ బీఆర్‌ఎస్ నాయకత్వం ఇప్పటికే పార్టీ శ్రేణులకు సూచనలు చేసింది. ప్రతి నియోజకవర్గంలో ఓటర్ల నమోదు బాధ్యతలను స్థానిక నాయకులకు అప్పగించడం, నమోదు శిబిరాలు నిర్వహించడం, పట్టభద్రులను నేరుగా కలవడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తోంది. కాగా ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ప్రస్తుత సభ్యుల పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగియనుంది. 

ఏకాభిప్రాయం కుదరలేదా? 

బీఆర్‌ఎస్ అభ్యర్థుల పేర్లు ఖరారైనప్పటికీ, అధికారిక ప్రకటనలో జాప్యంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల ఎంపిక, వారి రాజకీయ నేపథ్యం, సామాజిక సమీకరణాలు, క్షేత్రస్థాయి బలాబలాలను పరిశీలించి  తమ అభ్యర్థులను ప్రకటించాలనే వ్యూహం ఒకవైపు.. ఆశావహుల మధ్య పోటీ, సామాజిక వర్గాల సమతుల్యత, స్థానిక నాయకుల అభిప్రాయాలు వంటి అంశాలపై ఇంకా పూర్తి స్థాయి ఏకాభిప్రాయం కుదరకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అభ్యర్థుల ప్రకటనను కొంతకాలం వాయి దా వేయడం వల్ల ప్రత్యర్థులకు తమ రాజకీయ వ్యూహాన్ని ముందుగానే తెలియజే యకుండా ఉండవచ్చనే కోణం కూడా ఉంది. అదే సమయంలో అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్నప్పుడు ప్రకటన ఎందుకు చేయడం లేదన్న సందే హం పార్టీ శ్రేణుల్లో ఏర్పడే అవకాశం ఉంది. ఆశావహులు, వారి అనుచరులు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తుండటంతో అనిశ్చితి కొనసాగుతోంది. వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ అసెం బ్లీ ఎన్నికలకు భిన్నంగా ఉంటాయి. పట్టభద్రుల ఓటర్లను గుర్తించడం, వారిని ఓటర్ల జాబితాలో నమోదు చేయించడం, వ్యక్తిగతంగా కలిసి మద్దతు కోరడం, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యావంతుల సమస్యలను ప్రధానంగా ప్రస్తావించడం వంటి అంశా లు కీలకం.

అభ్యర్థి ప్రకటన ఆలస్యమైతే ఈ కార్యక్రమాలన్నింటినీ తక్కువ వ్యవధిలో పూర్తి చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. మరో వైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా ఇంఛార్జీలను నియమిం చడం, నాయకులకు బాధ్యతలు అప్పగించడం వంటి చర్యలు చేపట్టారు. ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలో పార్టీ నేతలను సమన్వయం చేస్తూ ఎన్నికల సన్నద్ధతకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ప్రకటనకు ముందే క్షేత్రస్థాయి ఎన్నికల యంత్రాంగాన్ని సిద్ధం చేసే పనిని బీఆర్‌ఎస్ ప్రారంభించింది.

మరిన్ని వార్తలు