కుల భవనాలతో లాభమెవరికి?
తెలంగాణలో కులాల పేరుతో ‘స్వయం గౌరవ భవనాల’ కోసం ప్రభుత్వాలు కోట్లు విలువ చేసే భూములను, నిధులను కేటాయిస్తున్నాయి. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) 40 బీసీ కుల సంఘాలకు కోకాపేట, ఉప్పల్ భగాయత్ ప్రాంతాల్లో 82.30 ఎకరాలు భూములిచ్చింది. భవనాల నిర్మాణాలకు రూ.95.25 కోట్లు కేటాయించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 38 భవనాలకు రూ.88.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. పార్టీలు మారినా పద్ధతి మారలేదు.
వీటి వల్ల ఆయా కులాల్లోని నిరుపేదలకు నిజంగా దక్కుతున్నదేమిటి? ప్రజా వనరులను విద్య, వైద్యం, ఉపాధికి మళ్లిస్తే అంతకంటే ఎక్కువ ప్రయోజనం ఉండ దా?.. వాస్తవానికి గతంలో ఈ స్థలాల విలువ రూ.4,000 కోట్లుగా ప్రకటించారు. హెచ్ఎండీఏ వేలంలో కోకాపేట నియోపోలీస్ పరిధి లో ఎకరం రూ.151.25 కోట్ల మేర పలికింది. కేటాయించిన భూముల వినియోగ నిబంధనలు వేరుగా ఉన్న ప్పటికీ, ప్రజా ఆస్తి అయిన ఈ భూముల విలువను తక్కువగా అంచనా వేయలేం. ప్రభుత్వం ఏ సంఘానికి ఎంత విస్తీర్ణం, ఏ సర్వే నంబర్లో ఇచ్చింది, అప్పటి ప్రభుత్వ విలువ, ప్రస్తుత మార్కెట్ విలువ ఎంత అనే వివరాలతో సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలి.
కులాలకే అంత ప్రాధాన్యమా?
రాష్ట్రంలో పాఠశాలలు 2024 43,154 ఉండగా 2025 నాటికి 41,762కు తగ్గాయని ‘యూడైస్’ లెక్కలు చెబుతున్నాయి. 4,793 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నట్లు కేంద్ర నివేదికలు పేర్కొంటున్నాయి. వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థి తుల్లో కోకాపేట వంటి విలువైన ప్రాంతాల భూములను విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ఉచిత కోచింగ్ సెంటర్లు, గ్రంథాలయాల కోసం వాడితే కులమతాలకు అతీతంగా పేదలందరికీ మేలు జరుగుతుంది.
ఉపాధ్యాయులు, వైద్య సిబ్బందికి ఉద్యోగ అవకాశాలూ లభిస్తాయి. ఒక అవస రానికి ప్రజా వనరులను వెచ్చిస్తున్నప్పుడు ప్రత్యామ్నాయ వినియోగం ద్వారా కలిగే ప్రయోజనాన్ని ప్రభుత్వం విస్మరించకూడదు. రాజ్యాంగ బద్ధంగా ’కుల నిర్మూలన’ లక్ష్యంగా పనిచేయాల్సిన ప్రభుత్వాలు, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కులానికి కొన్ని ఎకరాల చొప్పున పంచి ప్రత్యేక గోడలు కట్టడం వల్ల ప్రజలలో ’కులతత్వం’ పెరిగి, కులాల మధ్య పోటీతత్వం బలపడుతుంది. ఒకరికి ఇచ్చారు కాబట్టి మాకూ ఇవ్వాలనే డిమాండ్లు పెరిగి, వనరుల విభజనకు దారితీస్తుంది. ఇది సమ సమాజ స్థాపనకు తీవ్ర విఘాతం.
అంతేకాదు, ఒకే కులంలో ధనికులు, మధ్యతరగతి, పేదలు ఉంటారు. భవనాలు కట్టినంత మాత్రాన నిరుపేదలకు చదువు, ఉద్యోగం, ఆర్థిక భద్రత దక్కవు. నాయకత్వంలో రాజకీయ పలుకుబడి ఉన్నవారే ఆధిప త్యం చెలాయించే ప్రమాదం ఉంది. ప్రభుత్వం చెబుతున్నట్లు వీటిని వసతి, శిక్షణ కేంద్రాలుగా వాడితే.. అందుకు సంబంధించిన కార్యాచరణను ముం దే స్పష్టం చేయాలి. హైదరాబాద్లో నిర్మించే ఈ భవనాలు జిల్లా ల్లోని పేదలకు ఏ మేరకు ప్రయోజనం కలిగిస్తున్నాయో ఎప్పటికప్పుడు బహిర్గతం చేయాలి.
జీఓ నంబర్ 14 ద్వారా నిర్వహణలో ప్రభుత్వం పాత్ర పెంచినప్పటికీ, రాజకీయ జోక్యం లేకుండా చూడటం ముఖ్యం. ఈ భూములను లీజుకు ఇవ్వడం, అమ్మడంపై కఠిన నిబంధనలను అమలు చేయాలి. ప్రజల పన్నులతో సమకూరిన నిధులు, భూములు ఏ ఒక్క కులానికో, సంఘానికో సొంతం కావు. కులాల పేరుతో భవనాలు నిర్మించడంలో చూపే ఉత్సాహాన్ని పేదలకు నాణ్య మైన విద్య, వైద్యం, జీవన భద్రత కల్పించడంలో చూపాలి. చివరకు సమాజం పరిగణనలోకి తీసు కునేది నిర్మించిన భవనాల సంఖ్యను కాదు, వాటి వల్ల మారిన నిరుపేదల జీవి తాల సంఖ్యను మాత్రమే!
సత్యశోధక మహాసభ
పాపని నాగరాజు