77యేండ్ల రాజ్యాంగం.. అదే బానిసత్వం!
దుండ్ర కుమారస్వామి:
నవంబర్ 26, 1949 భారత రాజ్యాంగంను(Constitution of India) రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు. భారత ప్రజాస్వామిక వ్యవస్థ(India's Democratic System) కూర్పులో ఒక చారిత్రక మైలురాయి. నేటికి ఆ చారిత్రక ఘట్టానికి 77 ఏండ్లు నిండుకుంటున్నాయి. సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం అనే మహోన్నత ఆశయాలతో రూపొందిన రాజ్యాంగం దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నది. కానీ, నేటికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాల జీవితాల్లో ఆశిం చిన వెలుగులు కనిపించడం లేదు?ఈ ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం(Central Government) సహా పాలక వ్యవస్థలే సమాధానం చెప్పాలి.
* రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వపు హక్కును కల్పించింది. ఆర్టికల్ 15(4) సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలను సూచిస్తున్నది. ఆర్టికల్ 16(4) ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను పేర్కొన్నది. ఆర్టి కల్ 46 బలహీన వర్గాల విద్యా, ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించాలని నిర్దేశించింది. ఆర్టి కల్ 340 వెనుకబడిన వర్గాల పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కమిషన్ల ఏర్పాటును సూచించింది.
* ఈ రాజ్యాంగ స్ఫూర్తి పాలక వ్యవస్థలో ఎంతవరకు ప్రతిబింబిస్తున్నది. దేశవ్యాప్తంగా బీసీల విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక అభివృద్ధికి పాలకుల విధానాలు ఏమాత్రం ఫలితాలు సాధించాయి. తరతరా లుగా సామాజిక, ఆర్థిక వెనుకబాటుకు గురవుతున్న వర్గాలకు సమానావకాశాలు కల్పించకుండా సమానత్వం సాధ్యమవుతుందా? రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అమలు చేయాల్సిన పాలకులే జవాబుదారీతనం నుం చి తప్పించుకుంటే సామాజిక న్యాయం ఎక్కడి నుంచి వస్తుంది? దేశ ఆర్థిక వ్యవస్థకు బీసీ కులాల ప్రజల భాగస్వామ్యం కీలకమైనది.
అంతేకాదు, ఎన్నికలకు బీసీల ఓట్లు కావాలి. ప్రభుత్వాలు ఏర్పాటుకు మద్దతు కావాలి. కానీ కీలక పదవులు, విధాన నిర్ణయాలు, అధికార పంపిణీ విషయంలో వివక్షకు కారణమెవరు? బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడానికి కులగణన అత్యంత కీలకం. 2027 జనగణన రెండో దశలో కులాల వివరాలు సేకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే అది ప్రకటనకే పరిమితం కావద్దు. కులగణనలో ఏయే వివరాలు సేకరిస్తారు? ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారు? అన్నది కేంద్రం ముందుగానే స్పష్టం చేయాలి.
కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష నియామకాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. అయితే, ఈ నియామకాల్లో ఓబీసీల ప్రాతినిధ్యం 27 శాతాన్ని మించిందని కేంద్రం చెబుతోంది. అయితే మొత్తం ఉద్యోగుల సంఖ్య, వివిధ హోదాలు, ఉన్నతస్థాయి పోస్టులు, పదోన్నతులు, శాఖలవారీ వివరాలను విడివిడిగా ప్రజల ముందుంచాలి. రిజర్వేషన్ల అమలుపై శాతాలు ప్రకటించడం కాకుండా, అర్హులకు అందుతున్నాయో లేదో నిరూపించాల్సిన బాధ్యత కేంద్రానిదే.
* తెలంగాణలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఈ చర్చకు మరో కీలక కోణా న్ని జోడిస్తోంది. బీసీ సంక్షేమానికి ప్రతి ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేల కోట్లు కేటాయించి ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని, బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల హామీలిచ్చారు. ప్రభుత్వ పదవులు, నామినేటెడ్ పోస్టులు, మంత్రివర్గంలో జనాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. అయితే ఈ హామీల అమలుపై బీసీ సంఘాలు, ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఏడు దశాబ్దాల సామాజిక అనుభ వం ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. రాజ్యాంగంలో హక్కులు పొందుపరిచినంత మాత్రాన సామాజిక అసమా నతలు తొలగిపోవు. వాటి అమలుకు బలమైన చట్టాలు, సమర్థవంతమైన సంస్థలు, పారదర్శకమైన విధానాలు, ప్రభుత్వాల జవాబుదారీతనం అవసరం. ఆ బాధ్యత నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకోలేవు.
వ్యాసకర్త: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు సెల్: 9959912341