బియ్యం నిల్వలు సిద్ధం చేయండి

26-11-2026 | 05:15am

15 నెలలకు సరిపడా ఉండాలి

అధికారులకు మంత్రి ఉత్తమ్‌కుమార్ ఆదేశం

హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావంతో(impact of El Niño) రానున్న వ్యవసాయ సీజన్లలో పంటల ఉత్పత్తిపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ఆహార భద్రతకు(State Food Security) విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) అధికారులను ఆదేశించారు. ప్రజాపంపిణీ వ్యవస్థతో(Public Distribution System) పాటు ప్రభుత్వ సంస్థల అవసరాలకు కనీసం 15 నెలల పాటు సరిపడా సన్నబియ్యం నిల్వలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. బుధవారం పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ పనితీరుపై మంత్రి సమీక్షించారు.

ధాన్యం కొనుగోళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించవద్దని, సన్నబియ్యం పథకానికి నిరంతర సరఫరా ఉండేలా నిల్వలు పెంచాలని ఆదేశించారు. క్వింటాల్‌కు రూ.500 బోనస్‌కు అర్హత కలిగిన ఏడు రకాల సన్నధాన్యంపై కొనుగోలు కేంద్రాల్లో విస్తృత ప్రచారం చేపట్టాలని మంత్రి సూచించారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా మరిన్ని నిత్యావసర వస్తువులు అందించేందుకు ఆర్థికంగా ఆచరణ సాధ్యమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు.

పౌరసరఫరాల సంస్థ నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల టన్నుల సామర్థ్యంతో ఆధునిక సైలో ఆధారిత గోదాములు నిర్మించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. సైలోల నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం సంస్థ అంతర్గత వనరులతో పాటు వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందే అవకాశాలను పరిశీలించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వానికి బకాయిపడిన రైస్ మిల్లర్ల నుంచి ప్రతి రూపాయినీ వసూలు చేసేందుకు చర్యలు కొనసాగుతాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు