కవలలు జన్మిస్తారని తెలిసిన క్షణాన..
కోలీవుడ్‌లో(Kollywood) ఆసక్తికరమైన కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇంజి వెల్లం’(Inji Vellam). విలక్షణ నటుడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi), నేచురల్ బ్యూటీ సాయిపల్లవి(Sai Pallavi) తొలిసారి జంటగా నటిస్తుండటం.. ప్రముఖ దర్శకుడు మణిరత్నం(Mani Ratnam) తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో చైత్ర జే ఆచార్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఆచ్చి ఆచ్చి...’ పేరుతో ఫస్ట్ సింగిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాటను ఇళంగో కృష్ణన్ రాయగా.. వైశాలి సమంత్, శరణ్య శ్రీనివాస్ ఆలపించారు.
తమిళ, మలయాళ భాషల పదాలతో రూపొందిన ఈ పాట ప్రేమ, మాతృత్వంలోని మధురమైన అనుభూతులను ప్రతిబింబించేలా సాగుతోంది. ఈ లిరికల్ వీడియోలో సాయిపల్లవి కొత్త లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పొట్టి జుట్టుతో కనిపిస్తున్న ఆమె పాత్ర గర్భవతిగా ఉండటం, కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు సూచించే దృశ్యాలు ఆసక్తిని పెంచుతున్నాయి. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 జనవరి 29న థియేటర్లలో విడుదల కానుంది.