నేను ఆ డైరెక్టర్‌లా కాదు..
రియాలిటీగా ఉండే కథలే ఇష్టం: ఎస్ కృష్ణ
దర్శకుడు అనిల్ రావిపూడితో(Director Anil Ravipudi) కలిసి పలు విజయవంతమైన సినిమాలకు కో-రైటర్‌గా పనిచేసిన ఎస్ కృష్ణ(S Krishna) ‘హై’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ఆయన ఒక ప్రధాన పాత్రలోనూ నటిస్తున్నారు. హరీశ్ పెద్ది, ఎస్ కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నటుడు, దర్శకుడు ఎస్ కృష్ణ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. “-రచయితగా నా ప్రయాణం హాయిగా సాగుతోంది. మంచి కథ చెప్పాలని ‘హై’ సినిమా రాసుకున్నా.
ఇది విభిన్నమైన చిత్రం. కొత్త నటులు ఉన్నప్పుడు ఆరంభంలో కథలోకి వెళ్లడానికి కొంత సమయం తీసుకున్నప్పటికీ, ఒక్కసారి కథలోకి వెళ్లిన తర్వాత అందులో లీనమైపోతారనే నమ్మకం ఉంది. ఇందులోని పాత్రలన్నింటికీ ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ప్రతి పాత్రకు ఒక హై ఉంటుంది. అందుకే ఈ సినిమాకు ‘హై’ అనే టైటిల్ పెట్టా. ఇది జెన్ జీ యూత్, ఫ్యామిలీ అందరూ చూడాల్సిన సినిమా. ఈ కథ రాసుకున్నప్పుడు -అంతా కొత్తవాళ్లతో చేయాలనేది నా ఆలోచన. నా క్యారెక్టర్‌ను నేనే యాక్ట్ చేస్తానని ముందు అనుకోలేదు.
ఒకరిద్దరిని అడిగినా, వాళ్ల డేట్స్ కుదరలేదు. అందుకే నేనే నటించాల్సి వచ్చింది. అయితే ఇకపై నేను డైరెక్ట్ చేసే సినిమాల్లో నటించకూడదని, నటించే సినిమాలు డైరెక్షన్ చేయకూడదని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ రెండూ చేయడం చాలా కష్టం. అనిల్ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. నేను నాదంటూ ఒక స్టైల్లో కథ రాసుకున్నా. ఇందులో స్క్రీన్‌ప్లే ఆంథాలజీ స్టైల్‌లో ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో ఆంథాలజీ అనే భావన కలగదు. నాకు ఇష్టమైన డైరెక్టర్ మణిరత్నం. అనిల్ రావిపూడి కూడా ఇష్టమే.. కానీ తన స్టైల్‌ను నేను అనుకరించలేను.. రియాలిటీకి దగ్గరగా ఉండే కథలను ఇష్టపడతా” అని తెలిపారు.